Yes Bank | ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ యెస్ బ్యాంక్ కో-ఫౌండర్ రాణా కపూర్, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (డీహెచ్ఎఫ్ఎల్) ప్రమోటర్లు కపిల్, ధీరజ్ వాధ్వాన్లు నిధులు దారి మళ్లించారు. అనుమానాస్పద లావాదేవీల ద్వారా రూ.5,050 కోట్ల నిధులు దారి మళ్లించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిగ్గు తేల్చింది. రాణా కపూర్‌తోపాటు ఆయన కుటుంబం, వాధ్వాన్లు, ఇతరుల హవాలా లావాదేవీలపై స్పెషల్ కోర్టులో ఈడీ రెండో అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది.
రాణా కపూర్, డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు కపిల్ వాధ్వాన్, ధీరజ్ వాధ్వాన్లు, ఇతరులు అనుమానిత లావాదేవీల ద్వారా నిధులు చట్ట విరుద్ధంగా దారి మళ్లించడానికి నేర పూరిత కుట్రకు పాల్పడ్డారు. ఈ లావాదేవీల మొత్తం రూ.5050 కోట్లు అని ఈడీ ఇటీవల దాఖలు చేసిన తన చార్జిషీట్లో తెలిపింది.
డీహెచ్ఎఫ్ఎల్ వద్ద 2018 ఏప్రిల్-జూన్ మధ్య రూ.3700 కోట్ల విలువైన డిబెంచర్లను యెస్ బ్యాంక్ కొనుగోలు చేసింది. ఆ మేరకు నిధులు డీహెచ్ఎఫ్ఎల్కు బదిలీ చేసింది యెస్ బ్యాంక్. ఆ తర్వాత డైట్ అర్బన్ వెంచర్స్ ( DOIT Urban Ventures ) అనే రాణా కపూర్ కుటుంబానికి చెందిన సంస్థకు రూ.600 కోట్ల రుణం మంజూరు చేసింది డీహెచ్ఎఫ్ఎల్. డీహెచ్ఎఫ్ఎల్ విక్రయించిన స్వల్పకాలిక డిబెంచర్ల కోసం యెస్ బ్యాంక్ ప్రజల సొమ్మును ఉపయోగించింది. ఇప్పటికీ డీహెచ్ఎఫ్ఎల్ సదరు డిబెంచర్లను రీడీమ్ చేసుకోలేదు.
డైట్ అర్బన్ వెంచర్స్ ( DOIT Urban Ventures ) సంస్థకు ఎటువంటి పూచీకత్తు లేకుండా డీహెచ్ఎఫ్ఎల్ సంస్థ రూ.600 కోట్లు రుణాలిచ్చింది. కానీ రూ.39.68 కోట్ల విలువైన వ్యవసాయ భూమిని రెసిడెన్షియల్ ల్యాండ్‌గా మార్చినట్లు.. దాని విలువ రూ.735 కోట్లుగా పేర్కొన్నదని ఈడీ వివరించింది. ఇక వాధ్వాన్‌లకు చెందిన బిలీఫ్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు యెస్ బ్యాంక్ రూ.750 కోట్ల రుణం మంజూరు చేసింది. ఈ నిధులను వాధ్వాన్లు దారి మళ్లించారని ఈడీ అభియోగం.
ఎస్ బ్యాంక్ కో-ఫౌండర్‌గా రాణా కపూర్ తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడనడంలో సందేహం లేదని ఈడీ స్పస్టం చేసింది. తనకు, తన కుటుంబ సభ్యులకు అనుచిత ఆర్థిక లబ్ధి చేకూర్చాడని తెలిపింది.