న్యూఢిల్లీ, డిసెంబర్ 22: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)లపై కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా పడింది. ప్రధాన మంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) రుణాల్లో మొండి బాకీ (ఎన్పీఏ లేదా నిరర్థక ఆస్తులు)లు రెట్టింపవడం ఇందుకు అద్దం పడుతున్నది. ముద్ర పథకం కింద ఎంఎస్ఎంఈలు తీసుకున్న రుణాల్లో గత ఆర్థిక సంవత్సరం (2020-21) ఎన్పీఏలు రూ.34,090.34 కోట్లుగా ఉన్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.17,712.63 కోట్లుగా ఉన్నట్టు పార్లమెంట్లో ఓ ప్రశ్నకుగాను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరద్ చెప్పారు. దీంతో రెట్టింపైనట్టు స్పష్టమవుతున్నది. 2019-20లో రూ.26,078.43 కోట్లుగా ఉన్నాయని మంత్రి వివరాలు చెప్తున్నాయి. కాగా, ముద్ర పథకంలో మొండి బాకీలు పెరుగుతాయని ఊహించినదేనని కేర్ఎడ్జ్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ సంజయ్ అగర్వాల్ అంటున్నారు. లాక్డౌన్లు, ఉత్పత్తికి విరామం, మార్కెట్లో డిమాండ్ పడిపోవడం వంటి పరిణామాలు రుణాల చెల్లింపునకు అవరోధంగా మారాయన్నారు. ఎంఎస్ఎంఈలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం 2015 ఏప్రిల్లో ముద్ర పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. శిశు కేటగిరీలో రూ.50,000 వరకు, కిశోర్ కేటగిరీలో రూ.5 లక్షల వరకు, తరుణ్ కేటగిరీలో రూ.10 లక్షల వరకు రుణాలిస్తున్నారు. ఈ పథకం మొదలైన దగ్గర్నుంచి 27.87 కోట్ల శిశు రుణాలు, 3.61 కోట్ల కిశోర్ రుణాలు, 62.89 లక్షల తరుణ్ రుణాలను మంజూరు చేసినట్లు ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కరోనా రెగ్యులేటరీ ప్యాకేజీని ముద్ర రుణాలకూ వర్తింపజేశామని, దీనివల్ల నిరుడు రుణ వాయిదాలపై 6 నెలల మారటోరియం ఎంఎస్ఎంఈలకూ దక్కిందని చెప్పారు.