హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్షించాలనే ఉద్దేశంతో దుబాయ్ పర్యటనలో ఉన్న రాష్ట్ర పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు.. యూఏఈ-ఇండియా బిజినెస్ కౌన్సిల్(యూఐబీసీ) ప్రతినిధుల బృందంతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి యూఐబీసీ చైర్మన్-కేఈఎఫ్ హోల్డింగ్స్ వ్యవస్థాపకులు ఫైజల్ కొట్టికోలాన్ నేతృత్వం వహించారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో యూఐబీసీ పోషించాల్సిన పాత్రపై ఈ సందర్భంగా వారు చర్చించారు.
ఈ సమావేశం సందర్భంగా మంత్రి రాష్ట్రంలో అమలవుతున్న పారిశ్రామిక అనుకూల, స్నేహపూర్వక విధానాలతోపాటు టీఎస్ ఐ-పాస్ ద్వారా పరిశ్రమలకు సింగిల్ విండో పద్ధతిలో త్వరితగతిన అనుమతులు మంజూరు చేస్తున్నట్లు వారికి మంత్రి వివరించారు. భారతదేశ వైవిధ్యాన్ని గురించి వివరిస్తూ…. అనేక రాష్ర్టాలు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం అమలుచేస్తున్న మెరుగైన పారిశ్రామిక విధానాలు మరే ఇతర రాష్ట్రంలో లేవని, తెలంగాణలో పెట్టుబడి అవకాశాలను పరిశీలించేందుకు యూఐబీసీ ఆధ్వర్యంలో వ్యాపార ప్రతినిధుల బృందం హైదరాబాద్ రావాలని మంత్రి ఆహ్వానించారు. యూఐబీసీ ఇండియా అనేది యూఏఈ, భారత్‌ల మధ్య సమ్మిళిత ద్వైపాక్షిక వాణిజ్య వాతావరణాన్ని సృష్టించే లక్ష్యంతో రెండు ప్రభుత్వాలచే ఏర్పాటుచేయబడ్డ అధికారిక జాయింట్ బిజినెస్ ఛాంబర్. యూఐబీసీ ప్రతినిధుల బృందంలో ఈఎఫ్ఎస్ ఫెసిలిటీస్ గ్రూప్ సీఈవో తారిక్ చౌహాన్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సిద్దార్థ్ బాలచంద్రన్, ఎమ్మార్ సీఈవో అమిత్ జైన్ తదితరులున్నారు.