skin care in winter season | వణుకు పుట్టించే చలి.. చర్మంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో చాలామంది కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే క్రీములన్నీ గంపగుత్తగా పూసుకుంటారు. ఇలా చేస్తే, కొత్తకొత్త సమస్యలు కోరితెచ్చుకున్నట్లు అవుతుంది. చిన్నపాటి చిట్కాలు పాటిస్తే చలి బారినుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు.
మరీ వేడినీళ్లు వద్దు
వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఉదయం, సాయంత్రం వేడివేడి నీళ్లతో స్నానం చేస్తారు. ఆ సమయానికి హాయిగా ఉంటుంది కానీ, ఈ అలవాటు చర్మ ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదు. చలి వాతావరణం చర్మంలోని సహజమైన నూనెలను తగ్గిస్తుంది. దీనికి తోడు వేడినీళ్ల స్నానం వల్ల చర్మంపై పగుళ్లు ఏర్పడి రక్తస్రావ సమస్యలు వస్తాయి. ఎంత చల్లటి వాతావరణమైనా, గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడమే ఉత్తమం. రసాయనాల జాడలేని సేంద్రియ సబ్బులు వాడటం మరీ మంచిది.
స్వెట్టర్ ఒక్కటే సరిపోదు!
చలి నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు స్వెటర్ మాత్రమే సరిపోదు. కాళ్లకు సాక్స్, చేతులకు గ్లౌజులు ధరించాలి. బయటికి వెళ్లినప్పుడు ముఖానికి స్కార్ఫ్ కట్టుకోవాలి. ఇలాంటి జాగ్రత్తల వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
మాయిశ్చరైజర్ తప్పనిసరి
ఈకాలంలో చర్మం త్వరగా పొడిబారుతుంది. స్నానం చేసిన వెంటనే చర్మానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. విటమిన్-ఇ, చియా గింజలు, ఫ్యాటీ ఆమ్లాలు, లావెండర్ నూనెలు ఉన్న మాయిశ్చరైజర్‌నే ఎంచుకోవాలి. వాటర్ బేస్డ్ బదులు ఆయిల్ బేస్డ్ మాయిశ్చరైజర్లను కొనాలి.
సన్‌స్క్రీన్ అవసరమే
ఎండాకాలంలోనే సన్‌స్క్రీన్ అవసరమని అనుకుంటే పొరపాటు. చలికాలంలోనూ సూర్యరశ్మి చర్మానికి హాని చేస్తుంది. రుతువులతో సంబంధం లేకుండా, బయటికి వెళ్లినప్పుడు చర్మానికి సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవడం ఉత్తమం.
నీళ్లు మానొద్దు
వాతావరణం చల్లగా ఉన్నప్పుడు దాహం వేయదు. నీళ్లు తగ్గించి కాఫీ, టీలు ఎక్కువగా తీసుకుంటారు. దాంతో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. చర్మం పాలిపోతుంది, పొడిబారుతుంది, పగుళ్లు వస్తాయి. దాహం వేసినా వేయకపోయినా రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాల్సిందే.