వర్షాకాలంలో వాతావరణం ఎప్పుడూ తేమగా ఉంటుంది. ఇది అనారోగ్యంతోపాటు అందాన్నీ దెబ్బతీస్తుంది. చూసీచూడనట్లుండే చిన్నచిన్న తప్పులే.. పెద్దపెద్ద సమస్యలకు దారితీస్తాయి. ముఖ్యంగా.. ముఖవర్చస్సుపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. వానకాలంలో ఎదురయ్యే ప్రధాన సమస్య.. దుస్తులు ఆరకపోవడం. పచ్చిగా ఉండే వస్ర్తాలు అసౌకర్యంతోపాటు చర్మానికి హాని కలిగిస్తాయి. ముఖ్యంగా, తడి టవల్‌తో ముఖాన్ని తుడుచుకోవడం వల్ల మొటిమలు ఎక్కువ అవుతాయి. ముఖం ఎర్రబడటం, చర్మం కందిపోవడం లాంటి సమస్యలూ ఎదురవుతాయి. ఇందుకు కారణం.. తడారని టవల్స్‌పై బ్యాక్టీరియా, ఫంగస్, ఇతర సూక్ష్మజీవులు ఎక్కువగా వృద్ధి చెందడమే. ఆ టవల్‌ను వాడినప్పుడు అవి ముఖంపైకి చేరి..
ఇన్ఫెక్షన్లు, మొటిమలకు దారితీస్తాయి. ఇక తేమ వాతావరణంలో మేకప్ బ్రష్‌లపై ఎక్కువగా బ్యాక్టీరియా పెరుగుతుంది. చాలామంది మేకప్ వేసుకుని.. బ్రష్‌లను అలాగే వదిలేస్తారు. దాంతో వాటిపై ఫంగస్ పెరుగుతుంది. మళ్లీ అదే బ్రష్‌ను మేకప్ చేసుకోవడానికి ఉపయోగించినప్పుడు.. ఆ ఫంగస్ ముఖంపైకి చేరుతుంది. ఫలితంగా, మొటిమలు, ఇతర ఫంగల్ ఇన్ఫెక్షన్లు రావడానికి ఆస్కారం ఉంటుంది. ముఖం ఎర్రబడటం, దురద లాంటి సమస్యలూ చుట్టుముడతాయి. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే.. వర్షాకాలంలో ఉపయోగించే అన్ని దుస్తులు, మేకప్ బ్రష్‌లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. బాగా కడిగి, ఆరబెట్టిన తర్వాతే ఉపయోగించాలి. దీనివల్ల చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి.