సోమవారం 23 నవంబర్ 2020
Badradri-kothagudem - May 07, 2020 , 01:12:31

సడలింపుతో సంబురం..

సడలింపుతో సంబురం..

  • వ్యాపార వర్గాల్లో ఆనందం 
  • ఉమ్మడి జిల్లాలోభారీగా వస్తు క్రయవిక్రయాలు..
  • రూ.కోట్లల్లో టర్నోవర్‌
  • భౌతిక దూరం పాటించేందుకు పటిష్ట చర్యలు 
  • లాటరీ పద్ధతిలో 50 శాతం షాపులకు అనుమతి 

ఖమ్మం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ప్రజా జీవనానికి ఎలాంటి ఆటంకాలు కలుగకుండా చర్యలు చేపట్టడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వస్తు విక్రయ దుకాణాల నిర్వహణకు అనుమతి వ్వడంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో క్రయవిక్రయాలు సక్రమంగా జరిగాయి. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో నూటికి నూరు శాతం, పట్టణ, నగర ప్రాంతాల్లో 50 శాతం దుకాణాల నిర్వహణకు అనుమతివ్వడంతో వ్యాపార వర్గాలతో పాటు ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేశారు. బుధవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ప్రజా అవసరాల దృష్ట్యా భౌతిక దూరాన్ని పాటిస్తూ అన్ని వర్గాలకు అవసరమైన వస్తువులను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టడంతో జిల్లాలో అమ్మకాలు సక్రమంగా జరిగాయి. లాక్‌డౌన్‌ మరోవిడుత పెంచడంతో పాటు దుకాణాల నిర్వహణకు ఉదయం 10నుంచి రాత్రి 6 గంటల వరకు అవకాశం కల్పించడంతో షాపులను తెరిచారు. అయితే భారీగా విక్రయాలు జరిగినప్పటికీ ప్ర భుత్వం ప్రకటించిన 50 శాతం దుకాణాల నిర్వహణ పట్ల సరైన అవగాహన లేకపోవడంతో అధికార యం త్రాంగం గురువారం నుంచి పటిష్టంగా అమలయ్యే విధంగా చర్యలు చేపట్టనుంది. ప్రభుత్వం అనుమతించిన నిత్యావసర, వ్యవసాయ రంగం, దాని అనుబంధ వస్తు విక్రయాలు, నిర్మాణ రంగం తదితర దుకాణాల నిర్వహణకు అనుమతి లభించడంతో ప్రజలు ఆనం దం వ్యక్తం చేస్తున్నారు. స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ కార్యకలాపాలు కొనసాగనుండడంతో రియల్‌ ఎస్టేట్‌ రంగంలోని వారు రిజిస్ట్రేషన్లకు పూనుకోనున్నారు. భవన నిర్మాణ రంగానికి అవసరమైన ఇసుక, ఇటుక, సిమెంట్‌ను సమకూర్చుకునేందుకు అవకాశం కలుగడంతో ఇప్పటి వరకు ఉపాధిలేని అసంఘటిత రంగ కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాహనాల రిజిస్ట్రేషన్‌ యథాతథంగా కొనసాగించేందుకు చర్యలు తీసుకోవడంతో ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరగనుంది.  ద్విచక్ర వాహనాలు, కార్లు, వంటి వాహనా ల రవాణాకు అనుమతి లభించడంతో జిల్లాలోని ఇతర ప్రాంతాలకు పరిమితంగా వెళ్లేందుకు ఇప్పటి వరకు స్వీయ నిర్బంధంలో ఉన్న ప్రజలు ఉత్సుకత చూపుతున్నారు. గురువారం నుంచి జిల్లా యంత్రాంగం దుకాణాలను లాట రీ పద్ధతిలో నిర్వహించుకునేందుకు పటిష్ట చర్యలు చేపట్టనుండడంతో వ్యాపారులు తమకు లభించిన వెసులుబాటును వినియోగించుకునేందుకు ప్రణాళికను రూపొందించుకుంటున్నారు. దుకాణాల్లో పని చేస్తున్న పలువురు గుమస్తాలు, ఇతర ఉద్యోగులు వేతనాలు వస్తాయనే అనందంలో ఉన్నారు. పరిమిత విక్రయాలకు ప్రభుత్వం అనుమతించినప్పటికీ వస్తు విక్రయ ధరల్లో వ్యత్యాసం లేకుండా అధికారులు పర్యవేక్షణ కొనసాగించేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయనున్నారు. దీని కోసం జిల్లా యంత్రాంగం సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు విధులు నిర్వహించనున్నట్లు పేర్కొంటున్నారు.

మాస్కు ఉంటేనే వస్తు విక్రయం..

దుకాణాల వద్ద వస్తు విక్రయాలను చేస్తున్న యజమానులు మాస్కులు తప్పనిసరిగా ధరించడంతో పాటు కొనుగోలుదారులు కూడా ధరించేలా చర్య లు తీసుకోవాలని అధికార యంత్రాంగం పిలుపునివ్వడంతో వా రు ఆదిశగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మాస్కులు లేకుండా కిరాణా షాపులు, కూరగా యల దుకాణాలకు వస్తే తప్పకుండా చర్యలు ఉంటాయని అధికారులు పేర్కొంటుండడంతో వ్యాపారులు అప్రమత్తమవుతున్నారు.  పరిశుభ్రతను పాటిస్తూ సక్రమంగా విక్రయాలు కొనసాగే విధంగా చూసేందుకు అధికార యంత్రాంగం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయడంతో వారు మరింత పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.