హైదరాబాద్: వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) కాంగ్రెస్ పార్టీలో చేరికకు ముహూర్తం ఖరారయింది. ఈ నెల 4న పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఆమెతోపాటు మరో 40 మంది కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం పార్టీ కార్యకవర్గ సమావేశం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో కొనసాగుతున్నది.
షర్మిలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించాలని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించినట్టు తెలుస్తున్నది. ఈ మేరకు షర్మిల భర్త అనిల్‌కుమార్‌తో ఇప్పటికే ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు చర్చించినట్టు సమాచారం. ఫైనల్‌గా షర్మిలతో కూడా ఈ విషయం మరోసారి చర్చించాక ఏఐసీసీసీ అధికారికంగా ప్రకటిస్తుందని సమాచారం. కర్ణాటక, తెలంగాణలో సాధించిన విజయాల స్ఫూర్తితో ఏపీలోనూ పార్టీని బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ వ్యూహరచన చేస్తున్నదని, ఇందులో భాగంగానే షర్మిలకు పార్టీ బాధ్యతలు అప్పగించేందుకు పార్టీ పెద్దలు పావులు కదుపుతున్నట్టు తెలుస్తున్నది. ఏపీ కాంగ్రెస్ కమిటీ పగ్గాలు చేపట్టడానికి షర్మిల ఇప్పడే అంగీకరించని పక్షంలో తొలుత పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా నియమించి, ఆ తర్వాత పార్టీ పగ్గాలు అప్పగించాలన్నది పార్టీ వ్యూహమని చెప్తున్నారు.