అమరావతి : వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ( YS Jagan ) రాష్ట్రంలో మరోసారి పాదయాత్ర ( Padayatra ) పై క్లారిటీ ఇచ్చారు. వైఎస్ జగన్ 2017లో పాదయాత్ర నిర్వహించి 2019లో అధికారంలోకి వచ్చారు . బుధవారం ఏలూరు నియోజక వర్గ వైసీపీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
రాష్ట్రంలో పరిపాలన చాలా అన్యాయంగా జరుగుతుందని, రెడ్‌బుక్ ( Redbook ) రాజ్యాంగంతో కండకావరంతో పరిపాలన సాగిస్తుందని విమర్శించారు. పాలనంతా అబద్ధాలు, మోసాలతో నడుస్తుందని, దీనిని ప్రశ్నిస్తే కేసులు, జైళ్లపాలు చేస్తుందని దుయ్యబట్టారు. పోలీసు వ్యవస్థ ఎన్నడూ లేనంతగా దుర్వినియోగం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
వైఎస్ జగన్ పాలనే బాగుందని , ప్రతి నెలా సంక్షేమ పథకాల బటన్ నొక్కేవాడని ప్రతి ఇంట్లో చర్చ జరుగుతుందని పేర్కొన్నారు. రెండు సంవత్సరాల కోవిడ్ సమయంలో కూడా సమర్ధవంతంగా సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించామని వెల్లడించారు. సూపర్ సిక్స్, సూపర్ సెవన్ పథకాలు అమలు కావడం లేదని ఆరోపించారు. కూటమి పాలనలో ప్రభుత్వ పాఠశాలలో 9 లక్షల మంది చదువులు మానేశారని తెలిపారు.
బాబు పాలనలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని, కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అన్నారు. రాష్ట్రంలో ఏ వర్గానికి కష్టం వచ్చినా అండగా నిలబడుతున్నామని వివరించారు.
ఇప్పటికి కూటమి పాలన రెండు సంవత్సరాలు ముగిసిందని మరో ఏడాదిన్నర తరువాత ఎన్నికలకు ముందు తాను రాష్ట్రంలో మరోసారి పాదయాత్ర చేయనున్నట్లు వైఎస్ జగన్ ప్రకటించారు. పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలతో మమేకమై వారి కష్ట, నష్టాలను తెలుసుకుంటానని వెల్లడించారు. ఏలూరు నుంచే తన పాదయాత్ర ఉంటుందని స్పష్టం చేశారు.