హైదరాబాద్ : మాజీ మంత్రి వైఎస్ వివేకాంద రెడ్డి హత్య కేసులో నిందితుల రిమాండ్(Remand)ను సీబీఐ కోర్టు పొడిగించింది. చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఆరుగురు నిందితులను శుక్రవారం సీబీఐ కోర్టులో హాజరు పరిచారు. విచారణ సందర్భంగా ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమా శంకర్‌రెడ్డి, శివశంకర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్‌ను ఈనెల 30 వరకు పొడిగిస్తూ సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
2019 మార్చి 15న వైఎస్ వివేకా (YS Viveka) దారుణ హత్య(Murder)కు గురయ్యారు. వివేకా గుండెపోటుతో మృతి చెందారని అనుమానం వ్యక్తం చేసిన కుటుంబసభ్యులు ఆయన శరీరంపై గాయాలు ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో వివేకాది హత్య అని తేలడంతో పలువురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.
అనంతరం వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా అప్పటి నుంచి ఈ కేసు తెలంగాణ హైకోర్టు, సీబీఐ కోర్టు, సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతుంది. వైఎస్ వివేకా కూతురు సునీత న్యాయవాది కావడంతో ఇటీవల సుప్రీం కోర్టులో స్వయంగా వాదనలు వినిపించారు. నిందితుల్లో ఒకరైనా కడప ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణకు సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అవినాష్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని సునీత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ప్రస్తుతం బెయిల్ రద్దుపై వాదనలు కొనసాగుతున్నాయి. కాగా తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు అవినాష్‌రెడ్డి ప్రతి శనివారం సీబీఐ అధికారుల ముందు విచారణకు హాజరు అవుతున్నారు.