YS Viveka Murder Case | వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులంతా యథేచ్ఛగా బయటే తిరుగుతున్నారని ఆయన కుమార్తె వైఎస్ సునీత ఆరోపించారు. పులివెందులలో వివేకా ఘాట్ వద్ద సునీత దంపతులు నివాళులర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వాయిదాలకు నిందితులతో పాటు నేనూ కోర్టుకు హాజరవుతున్నా అని తెలిపారు. శిక్ష నిందితులకో.. తనకో అర్థం కావడం లేదని అన్నారు. ఇంకా ఎన్నేళ్లు న్యాయ పోరాటం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు.
వైఎస్ వివేకా హత్య కేసులో దర్యాప్తు పూర్తయ్యిందని సీబీఐ తెలిపిందని.. కానీ ఆ దర్యాప్తు ఇంకా అసంపూర్తిగా ఉందని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశానని చెప్పారు. న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని తెలిపారు. నాన్న హత్య రోజు అవినాశ్ రెడ్డి వచ్చి.. ముగ్గురు పేర్లు రాసి సంతకం పెట్టమన్నారని తెలిపారు. పోలీసులను బెదిరించి సాక్ష్యాధారాలన్నీ తుడిపివేశారని పేర్కొన్నారు. ఇప్పుడు జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా మళ్లీ బెదిరించాలని చూస్తున్నారని చెప్పారు. పులివెందుల డీఎస్పీతో అవినాశ్ రెడ్డి, సతీశ్ కుమార్ రెడ్డి బెదిరించే విధంగా మాట్లాడుతున్నారని, పాత పులివెందుల కాదని, హింస లేని కొత్త పులివెందులను ప్రజలుచూడాలని అనుకుంటున్నారని తెలిపారు.
నిన్న కడప ఎస్పీ అశోక్ కుమార్ను తన భర్త రాజశేఖర్ రెడ్డితో కలిసి సునీత కలిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘ మా నాన్నను గొడ్డలితో నరికి చంపి, గుండెపోటుగా చిత్రీకరించారు. హత్య తర్వాత అక్కడికి వెళ్లిన నాకు ఓ లేఖ ఇచ్చారు. ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, అప్పట్లో టీడీపీలో ఉన్న సతీశ్ రెడ్డి మా నాన్నను చంపినట్లు ఉన్న ఆ లేఖపై సంతకం చేయాలన్నారు. కానీ నేను చేయలేదు. దీంతో మేమే చంపామంటూ మాపై ఆరోపణలు చేశారు. సాక్షులను బెదిరిస్తున్నామని మాపైనే కేసులు పెట్టారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.