అమరావతి : వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో జరుగుతున్న ఆస్తుల తగాదాపై వైఎస్ షర్మిల (YS Sharmila ) మరోసారి మీడియాకు వివరించారు. ఆస్తుల పంపకం విషయంలో నేను చెబుతున్నది నిజమని బిడ్డలపై ప్రమాణం చేస్తానని నిన్నచెప్పిన విషయాలన్నీ నిజమని వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) ప్రమాణం చేయగలరా అంటూ ప్రశ్నించారు. ఒక దశలో ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.
పేర్లు పెట్టుకున్నంత మాత్రాన ఆస్తులు(Assets) ఇవ్వాలని ఉందా. ఆస్తులు నావైతే నేను కూడా జైలుకు వెళ్లాలి కదా అంటూ సుబ్బారెడ్డి లేవనెత్తిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఆస్తులు భారతి(Bharati) కి చెందినవైతే ఆమె కూడా జైలుకు వెళ్లాలి కదా అంటూ ఎదురు ప్రశ్నించారు. విజయమ్మను (Vijaywamma) కోర్టుకు లాగారంటే దానికి కారణం ఎవరు. సొంత కుమారుడే తల్లిని కోర్టుకు లాగడం దారుణం కాదా అని నిలదీశారు.
జగన్ (YS Jagan) కోసం రెండు ఎన్నికల్లో పాదయాత్ర చేశానని, నా మేలు కోసం ఆయన ఏమైనా చేశారా ? ఐదేళ్లపాటు ఎంవోయూ పత్రాలు నా వద్దే ఉన్నాయని వెల్లడించారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఆ ఎంవోయూ నేను వాడుకోలేదని , వైఎస్ కుటుంబం గురించి చెడ్డగా చెప్పుకుంటారనే ఎంవోయూపై మాట్లాడలేదని అన్నారు. సుబ్బారెడ్డి ఆలోచించి మాట్లాడాల్సిందని పేర్కొన్నారు.
ఈ గొడవలు ప్రతి ఇంట్లో ఉంటాయని అంటున్నారు. కన్నతల్లిని కోర్టుకు లాగడం ఘర్ ఘర్కీ కహానీ ఎలా అవుతుందని అన్నారు. జగన్ లాంటి వ్యక్తి నాయకుడో, శాడిస్టో వైసీపీ శ్రేణులు ఆలోచించాలని షర్మిల కోరారు.