YS Sharmila | ప్రధాని నరేంద్ర మోదీపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. నెహ్రూ ఈ దేశానికి అసలైన విశ్వాస పాత్రుడైతే, సిసలైన విశ్వాస ఘాతకుడు నరేంద్ర మోదీ అని విమర్శించారు. దేశ మొదటి ప్రధానిపై మోదీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని అన్నారు. ఇది స్వాతంత్ర్య ఉద్యమాన్ని, సమర యోధులను, దేశ చరిత్రను తీవ్రంగా అవమానించినట్లే అని పేర్కొన్నారు. లౌకిక ప్రజాస్వామ్యాన్ని దెబ్బకొడుతునట్లే అని స్పష్టం చేశారు. ప్రధాని హోదాలో పార్లమెంట్ సాక్షిగా మత విద్వేషాలను రెచ్చగొట్టినట్లే అని వ్యాఖ్యానించారు.
స్వాతంత్ర్యం కోసం 12 ఏళ్లు జైలు శిక్ష భరించిన నెహ్రూ మీద.. సిద్ధించిన స్వాతంత్ర్యంలో 12 ఏళ్లుగా పదవిలో ఉంటూ రాజభోగం అనుభవిస్తున్న మోదీ మాట్లాడడం సిగ్గుచేటు అని వైఎస్ షర్మిల విమర్శించారు. మోదీ మాటలు దెయ్యాలు వేదాలు వర్ణించడంతో సమానమని అన్నారు. బ్రిటీష్ పాలన అంతానికి జరిగిన స్వాతంత్ర్య ఉద్యమంలో బీజేపీ పూర్వీకులు ఎక్కడ అని ప్రశ్నించారు. మత ఛాందస వాదులు ఏనాడైనా వందేమాతరం ఉచ్చరించారా అని నిలదీశారు. కనీసం ఎప్పుడైనా జాతీయ పతాకానికి RSS సెల్యూట్ కొట్టిందా అని ప్రశ్నించారు. 2002 వరకు RSS కేంద్ర కార్యాలయంపై మూడు రంగుల జెండా ఎగిరిందా అని అడిగారు.
బెంగాల్ ఎన్నికల కోసం ప్రజల మధ్య మరోసారి విభజన తెచ్చేందుకు, విచ్ఛిన్నకర శక్తులను ఉసిగొల్పేందుకు జాతీయ గీతాన్ని వాడుకుంటున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. స్వాతంత్ర్యోద్యమ చరిత్రను పూర్తిగా వక్రీకరిస్తున్నారని అన్నారు. వ్యవస్థల మీద బీజేపీ అజమాయిషీ చర్చ రాకుండా నెహ్రూజీని దోషిగా చిత్రీకరించే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. విభజించు – పాలించు సిద్ధాంతాలను మళ్లీ ఆచరిస్తున్న మోదీ మరో అభినవ బ్రిటీషర్ అని వ్యాఖ్యానించారు. జాతీయగీతాన్ని, వందేమాతర స్ఫూర్తిని ఈ దేశంలో నిలబెట్టింది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని స్పష్టంచేశారు.