YS Sharmila | ఏపీ సీఎం చంద్రబాబుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న బనకచర్ల, నేడు నల్లమల సాగర్.. పోలవరం లింక్ ప్రాజెక్టుకు అనుమతులు రాకున్నా.. చంద్రబాబు ఆశ మాత్రం చావలేదని అన్నారు. అనుసంధానంపై ఉన్న శ్రద్ధ.. పోలవరం పూర్తి చేయడంపై లేదని విమర్శించారు. పనికి రాని ప్రాజెక్ట్ కు DPRల మీద , నిధుల సమీకరణ మీద పెట్టే దృష్టి .. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంపై పెట్టడం లేదని మండిపడ్డారు.
పోలవరంతో పాటు 56 ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉంటే వాటిని గాలికొదిలేసి లింక్ ప్రాజెక్ట్ అని పట్టుకు తిరుగుతున్నారని చంద్రబాబుపై షర్మిల మండిపడ్డారు. జలయజ్ఞానికి నిధులు లేవు కానీ.. రూ.58 వేల కోట్లతో పోలవరం – నల్లమల సాగర్ లింక్ కడతారట అని అన్నారు. ఇది భారీ అవినీతికి స్కెచ్ కాకపోతే మరేంటి అని ప్రశ్నించారు. లింక్ ప్రాజెక్ట్ తో ఉపయోగం లేదని నిపుణులు మొత్తుకుంటున్నా.. DPR పేరిట హడావిడి ఎందుకు అని నిలదీశారు. పోలవరం,పెండింగ్ జలయజ్ఞం ప్రాజెక్టులపై కూటమి ప్రభుత్వానికున్నది సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. ఎత్తు తగ్గించి కేంద్రం అన్యాయం చేసినా నోరు మెదపనిది ఇందుకే అని అన్నారు.
పోలవరం ఎత్తు 45.72 మీటర్ల నుంచి 41.15 కు కుదించి జీవనాడిలో జీవం తీశారని వైఎస్ షర్మిల విమర్శించారు. రూ.25వేల కోట్ల ఆర్ అండ్ ఆర్ మిగులు కోసం ప్రాజెక్టుని డ్యామ్ గా మార్చారని అన్నారు. 7 లక్షల ఎకరాలకు, 25 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు, 30 లక్షల మందికి తాగునీరు అందించే పోలవరం ప్రాజెక్టు స్వరూపాన్ని మార్చి ప్రశ్నార్థకం చేశారని అన్నారు.. బ్యారేజ్‌గా తప్ప బహుళార్థక సాధకంగా పనికి రాకుండా చేశారని విమర్శించారు. సర్వం కోల్పోయిన నిర్వాసితులకు పరిహారం అందించక తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. జాతీయ హోదా ప్రాజెక్టుకి కేంద్రం ఇంత అన్యాయం చేస్తుంటే, మిగులు బడ్జెట్ కోసం రాష్ట్ర ప్రయోజనాలకు సమాధి కడుతుంటే కూటమిలో పెద్దన్న పాత్ర పోషించే చంద్రబాబు నోరుమెదపకుండా లింక్ పేరుతో హంగామా చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. బాబుకు ATMగా పనికొచ్చేందుకే ఈ కొత్త ప్రాజెక్టు అని ఆరోపించారు.
రాష్ట్రంలో జలయజ్ఞం పెండింగ్ ప్రాజెక్ట్ ల సంఖ్య 56.. ఇవ్వాల్టి అంచనాల ప్రకారం పూర్తి చేయాలంటే కావాల్సిన నిధులు రూ. 60 వేల కోట్లు.. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే అందుబాటులోకి వచ్చే సాగునీటి లభ్యత 581 టీఎంసీలు.. సాగుబడి జరిగే అదనపు విస్తీర్ణం అక్షరాల 54 లక్షల ఎకరాలు.. గోదావరి లింక్ ప్రాజెక్టుకు పెట్టే 80 వేల కోట్ల నిధులతో జలయజ్ఞం పూర్తి చేస్తే అదనంగా 30 లక్షల ఎకరాలకు ప్రయోజనం జరుగుతుందని వైఎస్ షర్మిల తెలిపారు. ఇంత తెలిసి చంద్రబాబు పెండింగ్ ప్రాజెక్ట్ లపై కన్నెత్తి చూడటం లేదంటే.. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఎంతుందో అర్థమవుతుందని అన్నారు.