అమరావతి : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( Sharmila ) ఆస్తుల కోసమే అన్న వైఎస్ జగన్పై దుష్ప్రచారం చేస్తున్నారనివైసీపీ నాయకులు వైవీ సుబ్బారెడ్డి, పేర్నినాని(YV Subbareddy , Perni Nani) ఆరోపించారు. జగన్పై ఉన్న కేసుల్లో బెయిల్ (Bail) రద్దు చేసే కుట్రలు చేస్తున్నారని మండిపడ్దారు. ఆస్తుల వివాదం(Assets Issue) పై శుక్రవారం షర్మిల వైఎస్సార్ శ్రేణులకు మూడుపేజీల లేఖను రాయడంతో వైసీపీ నాయకులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఖండించారు.
టీడీపీ (TDP) కుట్రలో షర్మిల భాగస్వామ్యమయ్యారని ఆరోపించారు. ఆస్తుల విషయమై తల్లి, చెల్లిపై కేసు వేయాలన్న ఉద్దేశం జగన్(Jagan) కు లేదని వెల్లడించారు. కోర్టులో కేసులు ఉండగా షేర్లను ఏ విధంగా మళ్లిస్తారన్న విషయమై జగన్ వాస్తవాలు తెలుపడం కోసమే నేషనల్ కంపెనీ లా యాక్ట్ ట్రిబ్యునల్లో కేసు వేశారని వివరించారు. కుటుంబ సభ్యులను బజారున కీడ్చే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.
జగన్ ప్రేమ అభిమానంతోనే షర్మిలకు ఆస్తులు రాసిచ్చారని, కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఇదంతా జరిగిందని తెలిపారు. ఆస్తుల కోసమే ఆమె రాద్దాంతం చేస్తుందని విమర్శించారు. షర్మిలకు లీగల్గా ఆస్తుల మీద హక్కు ఉంటే ఆమె కూడా కేసులు ఎదుర్కొనేవారని, జగన్ ఒక్కరే జైలుకు ఎందుకు వెళ్తారని ప్రశ్నించారు.
జగన్కు వచ్చిన డివిడెంట్ నుంచి ఆమెకు రూ. 200 కోట్లు ఇచ్చారని సుబ్బారెడ్డి వివరించారు. పేర్నినాని మాట్లాడుతూ వైసీపీ శత్రువులతో షర్మిల చేతులు కలిపిందని ఆరోపించారు. ఆమె తాపత్రయం అంతా ఆస్తుల కోసమేనని, తండ్రి ఆశయాల కోసం కాదని దుయ్యబట్టారు.