అమరావతి : రాష్ట్రంలో మొంథా తుపానును ( Montha cyclone ) ప్రభుత్వ యంత్రాంగం సమర్ధవంతంగా ఎదుర్కొందని , అధికారులంతా అద్భుతంగా పనిచేశారని చంద్రబాబు( Chandra babu ) చెప్పుకోవడం సిగ్గుగా లేదా అని వైసీపీ అధినేత , మాజీ సీఎం వైఎస్ జగన్( YS Jagan) ప్రశ్నించారు.
18 నెలల కూటమి పాలనలో సుమారు 16 సార్లు ప్రతికూల వాతావరణం, వైపరీత్యాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. రైతులకు ఇవ్వాల్సిన రూ.600 కోట్ల ఇన్‌ఫుట్ సబ్సిడీ బకాయి పెట్టారని, ఒక్క పైసా కూడా పంట నష్ట పరిహారం కింద ఇవ్వలేదని ఆరోపించారు. తుపాను పరిస్థితులను గొప్పగా మేనేజ్మెంట్ చేశానంటూ గొప్పలు చెప్పుకోవడం చూస్తుంటే అవన్నీ పిట్టలదొర మాటల్లా ఉన్నాయని దుయ్యబట్టారు.
గతంలో వైసీపీ హయాంలో అందరికీ ఇ- క్రాప్, ఉచిత పంటల బీమా జరిగి ఉంటే విపత్తు సమయంలో ఎంతో భరోసా ఉండేదని ట్విటర్లో పేర్కొన్నారు. రైతులకు శ్రీరామ రక్షగా, భద్రతగా నిలిచే ఉచిత పంట బీమా పథకాన్ని రద్దు చేయడం, బెటర్ మేనేజ్మెంట్ అవుతుందా అంటూ నిలదీశారు.
మొంథా తుపాను కారణంగా సుమారు 15 లక్షల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లిందని, పంటల బీమాలేని రైతులకు దిక్కెవరని ప్రశ్నించారు.తుపాను పరిస్థితులను గొప్పగా మేనేజ్ చేసి ఉంటే 8 మంది ఎందుకు చనిపోయారని ప్రశ్నించారు. ఇంత దారుణమైన ప్లానింగ్ వల్ల చనిపోయినా మీలో ఏ కోశానా మంచి చేయాలన్న ఉద్దేశం కనబడదని, అన్నీ అబద్ధాలే, అన్నీలేని గొప్పలు చెప్పుకోవడమేనని ఆరోపించారు.