YS Jagan | ఏపీ సీఎం చంద్రబాబు నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తిచూపిందని మాజీ సీఎం వైఎస్ అన్నారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మత విశ్వాసాలను ఎలా రెచ్చగొడుతున్నారో సుప్రీంకోర్టు అర్థం చేసుకున్నదని తెలిపారు. అందుకే తిరుమల లడ్డూ కల్తీ అంశంలో చంద్రబాబు వేసిన సిట్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసిందని పేర్కొన్నారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని హితవు చెప్పిందన్నారు. రాజకీయ డ్రామాలు చేయవద్దని కోర్టు హెచ్చరించిందన్నారు.
రాజకీయ దుర్బుద్ధితోనే తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ఏపీ సీఎం చంద్రబాబు ప్రచారం చేశారని వైఎస్ జగన్ విమర్శించారు. తిరుమల ప్రతిష్ఠను చంద్రబాబు అపవిత్రం చేశారని అన్నారు. మత విశ్వాసాలను ఎలా రెచ్చగొడుతున్నాడో సుప్రీంకోర్టు అర్థం చేసుకుందని.. అందుకే ఆయనకు మొట్టికాయలు వేసిందని తెలిపారు. చంద్రబాబు, టీటీడీ ఈవో శ్యామలరావు ప్రకటనలకు వ్యత్యాసం ఉందని ఆయన వివరించారు. కల్తీ జరగలేదని టీటీడీ ఈవోనే చెప్పారని గుర్తు చేశారు. తిరుమల లడ్డూపై చంద్రబాబు చెప్పింది తప్పని ఈవో ప్రకటనలో తెలిపిసోతుందని చెప్పారు.
చంద్రబాబుకు దేవుడంటే భయం, భక్తి లేవని వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబులో పశ్చాత్తాపం కనిపించడం లేదని విమర్శించారు. దేవుడిపై భక్తి ఉంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేవుడిపై తప్పు జరిగిందని తెలిసినా ఇప్పటికీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు చివాట్లు పెడితే వాళ్లు మాత్రం మాపైనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కోర్టు వ్యాఖ్యలు, ఆదేశాలను వక్రీకరిస్తున్నారని.. భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బావ, బాబాయి, మామ అంటూ వక్రీకరిస్తున్నారని జగన్ మండిపడ్డారు. ఇంత దారుణంగా వక్రీకరిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ శ్రీవారి ప్రసాదంలో కల్తీ జరగకుండా తిరుమలలో గొప్ప వ్యవస్థ ఉంది. ప్రతి ట్యాంకర్‌ను మూడుసార్లు పరీక్షిస్తారు. అలా చెక్ చేశాక కల్తీ నెయ్యి వచ్చిన ట్యాంకర్లను వెనక్కి పంపించారు. చంద్రబాబు హయాంలో 14 సార్లు ట్యాంకర్లను వెనక్కి పంపించారు. మా హయాంలో 18 సార్లు వెనక్కి పంపించాం.’ అని వైఎస్ జగన్ తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలు నిలదీస్తున్న సమయంలో టాపిక్ డైవర్షన్ చేయడానికి తిరుమల లడ్డూపై చంద్రబాబు ఆరోపణలు చేశారని తెలిపారు. శ్రీవారి లడ్డూ విశిష్టతను అపవిత్రంచేసేలా వ్యాఖ్యలు చేశారని అన్నారు. రాజకీయ దురుద్దేశంతో చంద్రబాబు తెలిసి తెలిసి చేసిన తప్పు ఇది అని అన్నారు.