అమరావతి :ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ( Mudragada Padbhanabam ) భౌతికకాయం వద్ద మాజీ సీఎం వైఎస్ జగన్ ( YS Jagan ) నివాళి అర్పించారు. బుధవారం కాకినాడ జిల్లా కిర్లంపూడిలో నివాసానికి వెళ్లి ముద్రగడ భౌతికకాయానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ముద్రగడ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం జరిగిన అంతిమయాత్రలో వైఎస్ జగన్, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తదితరులు ముద్రగడ పాడెను మోసారు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముద్రగడ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మరణించారు. ఆయన అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేయగా ముద్రగడ పద్మనాభం కుటుంబసభ్యులు తిరస్కరించారు. బతికున్న సమయంలో ముద్రగడను అనేక విధాలుగా అవమానించారని, ఇప్పడు అధికారిక గౌరవాలు, సానుభూతి అవసరం లేదని స్పష్టం చేశారు.