అమరావతి : జాతిపితా మహాత్మాగాంధీ( Mahatma Gandhi ) , భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి (Lal Bahadur Shastri) జయంతి సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) గాంధీ, శాస్త్రి విగ్రహాలకు పూలమాలలవేసి నివాళి అర్పించారు. అనంతరం పార్టీ అనుబంధ విభాగాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో పాలన కుప్పకూలిందని ఆరోపించారు. వందరోజుల్లోనే బాబు మోసాలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు. అమ్మ ఒడి, విద్యాదీవెన, ఆస్పత్రులు, ఆరోగ్యశ్రీ, వాలంటీర్ల వ్యవస్థ (Voluntary system) , రైతు భరోసా అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయం తిరోగమనంలో పయనిస్తోందని, రాష్ట్రంలో రెడ్ బుక్ పాలనతో దాడులకు , విధ్వంసాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని విమర్శించారు. విజయవాడలో వరదల వల్ల నష్టపోయిన బాధితులకు పరిహారం అందడం లేదని అన్నారు. అనుకూలురైన వ్యక్తులకే పరిహారం అందిస్తున్నారని జగన్ మండిపడ్డారు. పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే చర్యలు తీసుకోలేదని అన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసేవారికే ప్రాధాన్యం ఇస్తామని అన్నారు.