YS Vijayamma | తనపై సోషల్‌మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సతీమణి వైఎస్ విజయమ్మ ఘాటుగా స్పందించారు. 2019 ఎన్నికలకు బాబాయ్‌ను లేపేసినట్లే 2024 ఎన్నికల ముందు పెద్ద తలకాయను జగన్ టార్గెట్ చేస్తాడేమో అని భావిస్తున్న తరుణంలో వైఎస్ విజయమ్మ కారు ప్రమాదానికి గురైందని టీడీపీ ఇటీవల ఒక పోస్టు చేసింది. ఆ ప్రమాదం తర్వాత భయపడి ఏడాది పాటు ఆమె అమెరికా వెళ్లిపోయారని ఆరోపించింది. ఈ ప్రచారంపై వైఎస్ విజయమ్మ ఘాటుగా స్పందించారు. తన కుమారుడిపై దుష్ప్రచారం చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని చూడటం అత్సంత్య జుగుప్సాకరమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు రోడ్డు ప్రమాదంపై వివరణ ఇస్తూ విజయమ్మ ఓ లేఖను విడుదల చేశారు.
గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం తనను తీవ్రంగా కలిచివేస్తోందని వైఎస్ విజయమ్మ అన్నారు. కొంతమంది సోషల్ మీడియాలో లేనిపోని అసత్య కథనాలు ప్రచారం చేయడం చూస్తుంటే తనకు తీవ్ర మానసిక వేదన కలుగుతోందని అన్నారు. తనను అడ్డం పెట్టుకుని చేస్తున్న నీచనికృష్ట రాజకీయాలకు ఖండించకపోతే ప్రజలు నిజం అని నమ్మే ప్రమాదం ఉందని అన్నారు. వాస్తవాలను, కొంత మంది దుర్మార్గపు ఉద్దేశాలను రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే వివరణ ఇస్తూ ఈ లేఖ రాశానని చెప్పారు.
రోడ్డు పక్కన దీనంగా పడి ఉన్న ఈ ఖరీదైన కారు ఎవరిదో కాదు… వందల మందిని తనకు రక్షణగా పెట్టుకుని తిరిగే లక్షల కోట్ల ఆస్తిపరుడు జగన్ మోహన్ రెడ్డి తల్లి విజయ రాజశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం ఇది. సరికొత్త కారు. అత్యాధునిక సెక్యూరిటీ హంగులు ఉన్న కారు. అయినప్పటికీ ఒకేసారి రెండు… pic.twitter.com/GWGdbXm6xz
— Telugu Desam Party (@JaiTDP) November 1, 2024
రెండు రోజుల కిందట తనకారుకు ప్రమాదం జరిగిందని సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారని విజయమ్మ అన్నారు. గతంలో ఎప్పుడో జరిగిన కారు ప్రమాదాన్ని .. తన కుమారుడిపై పెట్టి దుష్ప్రచారం చేయడం అత్యంత జుగుప్సాకరమని వ్యాఖ్యానించారు. రాజకీయంగా లబ్ది పొందాలనే ఈ ప్రయత్నం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. అమెరికాలో ఉన్న నా మనవడి దగ్గరకు వెళితే దాన్ని కూడా తప్పుగా చిత్రీకరించి… భయపడి నేను విదేశాలకు వెళ్లిపోయినట్లు దుష్ప్రచారం చేయడం అత్యంత నీతిమాలిన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజకీయ ప్రయోజనాల కోసం ఇంతగా దిగజారి ప్రవర్తించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని విజయమ్మ హితవుపలికారు. ఇలా దుష్ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించాలనే విధానం ఏమాత్రం సమర్థనీయం కాదని అన్నారు. ఈ నీచ సంస్కృతిని ఎటువంటి పరిస్థితుల్లోనూ సహించేది లేదని తెలిపారు. ఇకముందు ఇటువంటి దుష్ప్రచారాలను, వ్యక్తిత్వహనన వైఖరిని ఆపితే మంచిదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఈ వికృత చేష్టలను గమనిస్తూనే ఉన్నారని.. సరైన సమయంలో సరైన విధంగా బుద్ధి చెబుతారని తెలిపారు. ఇక పై ఇటువంటి లేనిపోని అసత్యాలను ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోదలచుకోలేదని హెచ్చరించారు.