Somireddy Chandra Mohan Reddy | ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్కు పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ రూ.1750 కోట్లు లంచం ఇచ్చినట్లు అమెరికా ఏజెన్సీల దర్యాప్తులో వెలుగుచూడటంపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. అవినీతిలో జగన్ మోహన్ రెడ్డి గ్లోబల్స్టార్గా ఎదిగారని విమర్శించారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాల అనంతరం మీడియా పాయింట్ వద్ద సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. అవినీతి సామ్రాట్ జగన్ రెడ్డి రాజకీయాల్లో ఉండటానికి అనర్హుడు అని మండిపడ్డారు. అదానీ గ్రీన్ ఎనర్జీ ఒప్పందానికి జగన్ రూ.1750 కోట్ల లంచం తీసుకున్నట్లు ఎఫ్బీఐ తేల్చిందని అన్నారు. జగన్ రెడ్డి లాంటి అవినీతిపరుడిని వైసీపీ వాళ్లే పార్టీ నుంచి బహిష్కరించాలని కోరారు.
రాజకీయ పార్టీ నడిపే అర్హత జగన్కు లేదని వ్యాఖ్యానించారు. సమాజంలో ఉండేందుకు జగన్ రెడ్డి అనర్హుడని సోమిరెడ్డి విమర్శించారు. దోచుకోవడానికి వీరికి ఏమైనా ప్రత్యేక చట్టాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఢిల్లీలో ముఖ్యమంత్రిని అరెస్టు చేశారని గుర్తు చేశారు. మరి ఏపీలో పరిస్థితిపై సీబీఐ, ఈడీ ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు.తమ ప్రభుత్వంలో పారదర్శకత తప్పుకుండా పాటిస్తామని స్పష్టం చేశారు.