Vijayasai Reddy | వైసీపీ సీనియర్ నాయకుడు విజయసాయి రెడ్డి రాజీనామాపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. విజయసాయి రెడ్డి రాజీనామా చిన్న విషయం కాదని ఆమె అన్నారు. తనను కాపాడుకోవడం కోసమే ఆయన్ను జగన్ బీజేపీలోకి పంపిస్తున్నారని ఆరోపించారు.
విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. జగన్కు విజయసాయి రెడ్డి అత్యంత సన్నిహితుడు అని తెలిపారు. జగన్ ఏ పని ఆదేశిసన్తే ఆ పనిచేయడం, ఎవరిని తిట్టమంటే వాళ్లను తిట్టడమే ఆయన పని అని అన్నారు. రాజకీయంగానే కాదు.. వ్యక్తిగతంగా కూడా తన బిడ్డల విషయంలో అబద్ధాలు చెప్పిన వ్యక్తి విజయసాయి రెడ్డి అని పేర్కొన్నారు. ఇలాంటి జగన్ సన్నిహితుడు రాజీనామా చేశారంటే అతి చిన్న విషయం కాదని అన్నారు. దీనిపై వైసీపీ, వైఎస్ అభిమానులు ఆలోచన చేయాలని సూచించారు.
విజయసాయిరెడ్డిని జగన్ ఎందుకు వదిలేశారని షర్మిల ప్రశ్నించారు. జగన్ రెడ్డి సన్నిహితులు ఒక్కొక్కరుగా ఎందుకు బయటకు వెళ్తున్నారని అడిగారు. ప్రాణం పెట్టిన వాళ్లు ఎందుకు జగన్ను వీడుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. నాయకుడిగా జగన్ విశ్వసనీయతను కోల్పోయారని ఆరోపించారు. నాయకుడిగా ప్రజలను, నమ్ముకున్న వాళ్లను జగన్ మోసం చేశారని, తనకు ఉన్న వాళ్లను కాపాడుకోలేకపోతున్నారని అన్నారు.
విజయసాయిరెడ్డి చాలా విషయాలను దాస్తున్నారని వైఎస్ షర్మిల అన్నారు. గతంలో ఆయన చెప్పినవన్నీ అబద్ధాలని తెలుసునని చెప్పారు. వైఎస్ వివేకా హత్య విషయంలో నిజం చెప్పినందుకు సంతోషం.. మిగతా విషయాలను కూడా బయటపెట్టాలని డిమాండ్చేశారు.