YS Jagan | తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం తిరుమల ప్రసాదాన్ని అపవిత్రం చేసిందని విమర్శించారు. జగన్ తిరుమల రాకను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తామని తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునే అర్హత జగన్కు లేదని తెలిపారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ కూడా డిక్లరేషన్ ఇచ్చి దర్శనానికి వెళ్లాలని డిమాండ్ చేశారు. ఇందిరాగాంధీ, అబ్దుల్ కలామ్ డిక్లరేషన్ ఇచ్చారని గుర్తుచేశారు.
జగన్ పర్యటనను నిరసిస్తూ ప్లకార్డులతో శాంతియుతంగా నిరసన తెలుపుతామని ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ప్రధాన కూడళ్లలో బ్యానర్లు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఐదేళ్లలో ఆలయాలను అపవిత్రం చేశారని విమర్శించారు. కాగా, తిరుపతిలో సేవ్ తిరుమల.. సేవ్ టీటీడీ సమావేశం జరిగింది. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు స్వామీజీలు డిమాండ్ చేశారు. గత ఐదేళ్లలో తిరుమల పవిత్రతను కాపాడలేదని విమర్శించారు. ఆ సమయంలో దర్శనానికి వెళ్లినా జగన్ డిక్లరేషన్ ఇవ్వలేదని శ్రీనివాసానంద సరస్వతి స్వామి అన్నారు. తిరుమలలో జగన్ మరో డ్రామాకు తెర తీసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
నెయ్యి వివాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని వీహెచ్పీ అఖిల భారత సంయుక్త ప్రధాన కార్యదర్శి శర్మ డిమాండ్ చేశారు. నెయ్యి కల్తీ వాస్తవమా లేదా అనే అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థలతో విచారణపై నమ్మకం లేదని అన్నారు. ప్రభుత్వం ఎవరిదైతే వాళ్ల పక్షాన విచారణ జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.