YS Jagan | పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికను రద్దు చేసి, రీపోలింగ్ నిర్వహించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ డిమాండ్ చేయడంపై మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పులివెందుల ప్రజలకు భయం పోయిందని.. ఆ భయం ఇప్పుడు జగన్‌కు పట్టుకుందని ఎద్దేవా చేశారు. జగన్ హయాంలో పోలీసులపై అనేక ఒత్తిళ్లు పెట్టారని.. తమ ప్రభుత్వంలో పోలీసు శాఖ స్వచ్ఛందంగా పనిచేస్తుందని తెలిపారు.
ఏపీ సచివాలయంలో మంత్రి పయ్యావుల బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగున్నాయని తెలిపారు. వైసీపీ నేతలు ప్రజాస్వామ్యంపై మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజలు, కేడర్‌ను రెచ్చగొట్టేందుకు జగన్ అనేక ప్రయత్నాలు చేశారని.. అయినప్పటికీ ప్రజలు ధైర్యంగా వచ్చి ఓటేశారని తెలిపారు. రేపు వచ్చే ఫలితాలను స్వీకరించేందుకు జగన్ సిద్ధంగా ఉండాలని అన్నారు. అసెంబ్లీ ఫలితాలనే జగన్ ఇంకా స్వీకరించలేదని విమర్శించారు. ఓటమికి కారణాలు వెతుక్కోవడం వైసీపీ నేతలకే చెల్లిందని వ్యాఖ్యానించారు.
గతంలో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ కూడా టచ్ చేయలేకపోయిందని మంత్రి పయ్యావుల తెలిపారు. ఆయన్ను అరెస్టు చేయడం సాధ్యం కాదని గతంలో నివేదికలు పంపించారని గుర్తుచేశారు. కానీ చంద్రబాబు సర్కార్‌లో కానిస్టేబుల్ వెళ్లి అవినాశ్ రెడ్డిని అడ్డుకున్నారని తెలిపారు. పోలీసులు సరిగ్గా పనిచేయడాన్ని వైసీనీ నేతలు భరించలేకపోతున్నారని అన్నారు. ఓట్ల చోరీకి మూలం వైసీపీనే అని స్పష్టం చేశారు. మేం ప్రజలను నమ్ముకున్నాం.. మీరు దొంగ ఓట్లను నమ్ముకున్నారని విమర్శించారు.