Suicide | ‘ నా లవర్ అని తెలిసి కూడా అతడిని ఎలా ప్రేమిస్తావు.. నువ్వే మా ప్రేమకు అడ్డుగా ఉన్నావు.. నువ్వు లేకపోతే మేం ప్రశాంతంగా ఉంటాం.. చచ్చిపో’ అంటూ స్నేహితురాలిని మరో యువతి బెదిరించింది. ఆమెకు ప్రేమికుడు కూడా వత్తాసు పలికాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి చెందిన బాధితురాలు ఉరివేసుకుని ఆత్మహత్య కు పాల్పడింది. శ్రీ సత్యసాయి జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. పెనుకొండ మండలం గొందిపల్లి గ్రామానికి చెందిన పూజారి స్వాతి (21) అనంతపురంలోని నలంద డిగ్రీ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతోంది. అక్కడే ఓ లేడీస్ హాస్టల్ ఉంటోంది. ఒకవైపు చదువుకుంటూనే, కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు మరోవైపు ఓ ల్యాబ్‌లో టెక్నీషియన్‌గానూ పనిచేస్తోంది. అక్కడ తనతో కలిసి పనిచేసే అరుణ్‌కుమార్, మరో యువతితో స్వాతికి స్నేహం కుదిరింది. ఈ క్రమంలోనే అరుణ్ కుమార్‌తో స్వాతి ప్రేమలో పడింది. ఈ విషయం తెలిసిన సదరు యువతి.. సోమవారం ఉదయం స్వాతికి ఫోన్ చేసి మందలించింది.
నా లవర్‌ను నువ్వెలా ప్రేమిస్తావు.. మేమిద్దం ముందు నుంచి ప్రేమలో ఉన్నాం కదా.. నువ్వే మా ప్రమేకు అడ్డం వస్తున్నావని స్వాతితో ఆ యువతి గొడవ పడింది. నా ప్రియుడిని మరిచిపోకపోతే ఈ విషయాన్ని ల్యాబ్‌లో పనిచేసే వాళ్లతో పాటు మీ హాస్టల్లో కూడా అందరికీ చెబుతానని బెదిరించింది. ఇదే విషయం అరుణ్‌కు చెబితే అతడు కూడా సదరు యువతికే వత్తాసు పలుకుతూ మందలించాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన స్వాతి.. హాస్టల్ గదిలో చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్వాతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.