YS Jagan | వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీనే అని మాజీ సీఎం వైఎస్ జగన్ ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. కేసులకు భయపడొద్దని.. అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్సీలతో తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో వైసీపీ ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు.
ప్రతిపక్ష హోదా కోరుతూ కోర్టులో పిటిషన్ వేశామని జగన్ తెలిపారు. కానీ దీనిపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సమాధానం ఇవ్వడం లేదని పేర్కొన్నారు. అసెంబ్లీలో ఉన్న ఏకైక ప్రతిపక్షం మనమే.. అయినా ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని అన్నారు. మనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాల్సి వస్తుందని.. అధికార పక్షం అంగీకరించడం లేదని తెలిపారు. అసెంబ్లీలో అవకాశం ఇవ్వకుంటే.. మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు.
వైఎస్ జగన్ అసెంబ్లీకి రాకపోతే అసెంబ్లీ సమావేశాలేమీ ఆగవని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ఈ నెల 22 వరకు అసెంబ్లీ సమావేశాలు సీరియస్‌గా జరుగుతాయని ఆయన స్పష్టంచేశారు. ఎమ్మెల్యేలు విధిగా అసెంబ్లీకి హాజరవ్వాలని సూచించారు. బడ్జెట్‌పై రేపు అసెంబ్లీ కమిటీ హాలులో ఎమ్మెల్యేలు అందరికీ శిక్షణ తరగతులు ఉంటాయని తెలిపారు. అలాగే విప్, చీఫ్ విప్‌లను కూడా రేపే ఖరారు చేస్తామని అన్నారు.