AP News | వైసీపీలో ఉండలేక చాలామంది నేతలు ఇబ్బంది పడుతున్నారని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. అలా ఉండలేకనే విజయసాయి రెడ్డి పార్టీలో నుంచి బయటకు వచ్చేశారని విమర్శించారు. వైసీపీ నుంచి బయటకు వచ్చినందుకు విజయసాయిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని అన్నారు. కడపలో ఆదివారం ఆదినారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌లాంటి నేతలను వదిలించుకోవాలని ప్రజలను కోరారు. రాజకీయాల్లోకి నేరగాళ్లను రానీయొద్దని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు.
వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో ఇప్పటికి విజయసాయిరెడ్డి నిజం చెప్పారని ఆదినారాయణ రెడ్డి అన్నారు. ఈ కేసు దర్యాప్తులో వేగం పెంచాలని కేంద్రాన్ని కోరారు. అసలు ఏ2 విజయసాయి రెడ్డికి, ఏ1 జగన్ రెడ్డికి మధ్య ఎందుకు విభేదాలు వచ్చాయని అడిగారు. జగన్మోహన్ రెడ్డి ఒంటెద్దు పోకడలను తట్టుకోలేకనే విజయసాయి రెడ్డి రాజీనామా చేసి బయటకు వచ్చేశారని ఆరోపించారు. జగన్ లండన్ నుంచి వచ్చేలోపు చాలామంది నేతలు పార్టీలో నుంచి బయటకు వెళ్లిపోతారని జోస్యం చెప్పారు. జగన్ బతిమిలాడిన కూడా విజయసాయి ఉండలేదంటే.. ఆ పార్టీ అట్టడుక్కు వచ్చేసిందనే విషయాన్ని గుర్తించుకోవాలని అన్నారు.
వైసీపీ ఓ డైనోసర్, వైఎస్ జగన్ బేకార్.. ఆయన్ను నమ్ముకున్న వాళ్లది అర్ధనాదమని ఆదినారాయణ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇలాంటి పార్టీ ఉండకూడదని.. నేతలందరూ బయటకు వచ్చేయాలని పిలుపునిచ్చారు. వైసీపీ నుంచి బయటకి వస్తే ఆ పార్టీ నాయకులకు పట్టిన దరిద్రం పోతుందని అన్నారు. చిన్నాన్నను నరికి చంపితే గుండెపోటు అని ప్రచారం చేశారని.. జగన్ లాంటి నేతలను వదిలించుకోవాలని ప్రజలను కోరారు. రాజకీయాల్లోకి నేరగాళ్లను రానివ్వద్దని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.