Chandrababu | ఎస్సీ కులంలో ఎవరు పుట్టాలనుకుంటారు అంటూ వ్యాఖ్యానించిన దళిత ద్వేషి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అని వైసీపీ మండిపడింది. దళితుల దగ్గర కంపు కొడుతుందంటూ ఈసడించుకున్న వ్యక్తి నాటి మంత్రి ఆదినారాయణ రెడ్డి అని తెలిపింది. దళితులకు రాజకీయాలెందుకురా అంటూ తూలనాడిన వ్యక్తి చింతమనేని అని పేర్కొంది. ఇవి చాలదా దళితులపై వాళ్లకు ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి అంటూ మండిపడింది. దీన్ని బట్టి తెలియదా చంద్రబాబు పాలనలో దళితులకు ఏ మాత్రం గౌరవం ఉండేదోనని చెప్పడానికి అని ట్విట్టర్లో ప్రశ్నించింది.
జగన్ ప్రభుత్వ హయాంలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు విపరీతంగా పెరిగాయని టీడీపీ చేసిన ఆరోపణలపై వైసీపీ ఘాటుగా స్పందించింది. చంద్రబాబు హయాంలో పెందుర్తిలో దళిత మహిళను వివస్త్రను చేసి కొట్టిన దగ్గరి నుంచి దళితులపై జరిగిన దమనకాండ వరకు ఎన్నో ఉన్నాయని వైసీపీ పేర్కొంది. దళితులపై చంద్రబాబు హయాంలో జరిగినన్ని నేరాలు ఇప్పటి వరకు ఎప్పుడూ జరగలేదని సాక్షాత్తూ కేంద్ర హోం శాఖ వెల్లడించే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదికే చెబుతోందని తెలిపింది. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై జరిగిన నేరాలు చూస్తే.. 2014-18 మధ్య ఏపీలో ఎస్సీ, ఎస్టీలపై జరిగిన నేరాలు 17,091 అంటే.. సగటున ఏడాదికి 3,418 ఘటనలు అని చెప్పింది. రాష్ట్రంలో దళితులపై 2014లో 4114 దాడులు, 2015లో 4415 దాడులు, 2016లో 2335 దాడులు జరగడం నాటి దారుణ పరిస్థితికి నిలువుటద్దని విమర్శించింది.
2014లో దేశంలో మొత్తం నేరాల్లో దళితులపై జరిగినవి 23.4 శాతం కాగా… ఏపీలో ఇది ఏకంగా 48.7 శాతం ఉందని వైసీపీ తెలిపింది. ఇక 2015లో దేశంలో ఇది 22.3 శాతం కాగా… ఏపీలో ఏకంగా 52.3 శాతం. బాబు హయాంలో దళితుల దుస్థితిని చెప్పటానికి ఇంతకన్నా లెక్కలు అక్కర్లేదేమో అని విమర్శించింది. జగన్ అధికారంలోకి వచ్చాక 2019– 21 మధ్య మూడేళ్లలో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై జరిగిన దాడుల సంఖ్య 7,046. అంటే… సగటున ఏడాదికి 2,348 ఘటనలు జరిగాయని తెలిపింది. టీడీపీ హయాంతో పోలిస్తే దాదాపు 32 శాతం తగ్గాయని చెప్పింది. రాష్ట్రంలో మొత్తం నేర ఘటనల్లో ఎస్సీ, ఎస్టీలపై జరిగిన ఘటనల శాతం కూడా 31 నుంచి 21 శాతానికి తగ్గిందని పేర్కొంది. ఇప్పటికైనా ఇలా రోజుకో అబద్ధంతో కాలయాపన చేయకుండా పాలనపై దృష్టి పెట్టాలని హితవు పలికింది. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేసింది.
ఎస్సీ కులంలో ఎవరు పుట్టాలనుకుంటారు అంటూ వ్యాఖ్యానించిన దళిత ద్వేషి @ncbn
దళితుల దగ్గర కంపు కొడుతుందంటూ ఈసడించుకున్నవ్యక్తి నాటి మంత్రి ఆదినారాయణ రెడ్డి
దళితులకు రాజకీయాలెందుకురా అంటూ తూలనాడిన వ్యక్తి చింతమనేని
ఇవి చాలదా దళితులపై వాళ్లకు ఎంత ప్రేమ ఉందో… https://t.co/tvSgQCn8P1 pic.twitter.com/SffiktKlqw
— YSR Congress Party (@YSRCParty) December 6, 2024