AP News | ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మాటిమాటికి బెంగళూరు వెళ్తున్నాడని టీడీపీ నాయకులు చేస్తున్న విమర్శలపై వైసీపీ ఘాటుగా స్పందించింది. గురివింద తన కింద ఉన్న నలుపెరుగుదు అన్నట్లుగా ఏపీ సీఎం చంద్రబాబు, టీడీపీ నాయకుల వ్యవహార శైలి ఉందని మండిపడింది. జగన్ బెంగళూరు వెళ్తున్నారని విమర్శించే ఏ ఒక్కరైనా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది.
☛ 2014 ఎన్నికల్లో ఏపీలోని కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ.. హైదరాబాద్‌లో ఓటు వేసిన మీకు జగన్ బెంగళూరు వెళ్తున్నారని మాట్లాడే అర్హత ఉందా?
☛ 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన మీరు హైదరాబాద్‌లోనే ఉంటూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చుట్టంచూపుగా వచ్చి వెళ్లేవారు అవునా? కాదా? కొవిడ్ సమయంలో రాష్ట్రం మొత్తం అల్లాడుతుంటే మీ తండ్రీకొడుకులు హైదరాబాద్ పారిపోయి తలదాచుకోలేదా?
☛ రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న మీకు ఇప్పటి వరకు రాష్ట్రంలోనే కాదు.. మీరు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో కూడా సొంత ఇల్లు లేదన్నది వాస్తవమా? కాదా?
☛ మీ వ్యాపారాలు, ఆస్తులు, మీ సంసారాలు అన్నీ పక్క రాష్ట్రాల్లో చేసుకుంటూ జగన్ బెంగళూరు వెళ్తున్నారని మాట్లాడడానికి మీకు కాసింతైనా సిగ్గనిపించడం లేదా?
☛ అవన్నీ పక్కన పెడితే.. రెండోసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మీరు ఈసారి అయినా రాష్ట్రంలోనే ఉంటున్నారా అంటే అదీ లేదు.. వీకెండ్ కాగానే హైదరాబాద్ వెళ్లిపోతూ అక్కడ ఎంజాయ్ చేసి మళ్లీ సోమవారం రాష్ట్రానికి తిరిగి వస్తున్నది వాస్తవమా? కాదా?
☛ మీ మాదిరి వీకెండ్ ఎంజాయ్మెంట్ కోసం జగన్2019-24 మధ్యలో ఎప్పుడైనా వెళ్లారా? ఇప్పుడు చెప్పండి.. గురివింద సామెత మీకు కరెక్టుగా సరిపోతుందా? లేదా?
☛ జగన్‌ను విమర్శించే స్థాయి కానీ, అర్హత కానీ మీలో ఏ ఒక్కరికీ లేదు. కాబట్టి సైలెంట్‌గా ఉంటే మంచిదని వైసీపీ హితవు పలికింది.