AP News | ఎన్టీఆర్ విదేశీ విద్య ఆదరణ పథకం కింద బకాయి పెట్టిన రూ.32.71 కోట్ల విడుదలకు ఏపీ ప్రభుత్వం పరిపాలన అనుమతులిచ్చింది. 640 మంది అభ్యర్థులకు చెల్లింపులకు అనుమతిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గత ఐదేళ్ల సైకో పాలనలో జరిగిన విధ్వంసకర, కక్ష సాధింపు పనులను కూటమి ప్రభుత్వం సరిచేస్తోందని టీడీపీ తెలిపింది. గత ఐదేళ్లుగా విదేశీ విద్య పథకంలో రూపాయి కూడా చెల్లించకుండా.. 640 మంది విద్యార్థులతో జగన్ ఆడుకున్నారని విమర్శించింది. గతంలో హామీ ఇచ్చినట్లుగా నేడు చంద్రబాబు ఆ బకాయిల్ని విడుదల చేశారని చెప్పింది. దీనిపై వైసీపీ మండిపడింది. విదేశీ విద్యాదీవెనకు పాతరేసింది టీడీపీనే అని విమర్శించింది.
టీడీపీ హయాంలో ఊరూ పేరు లేని, అసలు ఉన్నాయో లేవో తెలియని యూనివర్సిటీలకూ విదేశీ విద్యాదీవెన పథకాన్ని వర్తింపజేసి దోచుకుని ఇప్పుడు ఉద్ధరిస్తున్నట్లు బిల్డప్ ఇవ్వడం ఏంటి అని వైసీపీ మండిపడింది. ఐ-20 ఫాం సమర్పిస్తే చాలు.. వారు చదువుతున్నారా? లేదా? అన్న విషయాన్ని కూడా గతంలో పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆరోపించింది. కోర్సులను మధ్యలోనే మానేసిన వారు, ఒక కోర్సులో చేరి, మరో కోర్సుకు బదిలీ అయిన వారు, ఒక యూనివర్సిటీ నుంచి చదువులు పూర్తి చేయకుండా మరో చోటకు వెళ్లిన వారు.. ఇలా టీడీపీ ప్రభుత్వంలో లెక్కలేనన్ని అక్రమాలు జరిగాయని పేర్కొంది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటికీ అడ్డుకట్ట వేస్తూ రాష్ట్ర ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా చర్యలు తీసుకున్నారని స్పష్టం చేసింది.
ఒక సత్యనాదెళ్ల కాదు.. చాలా మంది సత్య నాదెళ్లలను తయారు చేసేలా జగన్ విదేశీ విద్యాదీవెన పథకాన్ని తీర్చిదిద్దారని వైసీపీ కొనియాడింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న నిబంధనలను జగన్ సడలించారని తెలిపింది. గతంలో కుటుంబ వార్షికాదాయం ఏడాదికి రూ.6 లక్షలు కాగా, జగన్ ప్రభుత్వంలో దాన్ని రూ.8 లక్షలకు పెంచారని గుర్తుచేసింది. కొన్ని దేశాల్లోని విద్యాసంస్థలకు మాత్రమే టీడీపీ ప్రభుత్వం పరిమితం చేస్తే జగన్ ప్రభుత్వం 21 కోర్సుల్లో టాప్ 50 స్థానాల్లో నిలిచే కాలేజీలున్న ఏ దేశానికి వెళ్లి చదివినా విదేశీ విద్యాదీవెన పథకాన్ని వర్తింపజేసిందని చెప్పింది.
టీడీపీ హయాంలో సగటున ఒక్కో విద్యార్థికి రూ.10-15 లక్షలు మాత్రమే ఇచ్చేదని వైసీపీ గుర్తుచేసింది. జగన్ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు గరిష్టంగా రూ.1.25 కోట్లు, మిగిలిన వారికి రూ.కోటి వరకు ఫీజు రీయింబర్స్మెంట్ అందించిందని తెలిపింది. దేశంలో ఎక్కడా ఇలా విద్యార్థులకు సాయం అందించే కార్యక్రమం జరగలేదని చెప్పింది. టీడీపీ ప్రభుత్వం దిగిపోతూ.. విదేశీ విద్యాదీవెన కింద అందాల్సిన దాదాపు రూ.318.80 కోట్లు బకాయిలు పెట్టి వెళ్లిందని బయటపెట్టింది. 2017-18 సంవత్సరం నుంచి కూడా పూర్తిగా చెల్లింపులు నిలిపేసిందని చెప్పింది. ఆ బకాయిలను జగన్ తీర్చారని.. లంచాలు, వివక్షకు తావు లేకుండా, పేద విద్యార్థులకూ విదేశీ విద్యను చేరువ చేసిన ఘనత జగన్‌ది అని కొనియాడింది. జగన్ హయాంలో విదేశీ విద్యాదీవెన పథకానికి ఎంపికైన 408 మంది విద్యార్థులకు రూ.107 కోట్లు అందించారని తెలిపింది.