అమరావతి : ఈనెల 4న వెలువడనున్న ఎన్నికల ఫలితాల్లో వైసీపీ(YCP) అల్లర్లకు పాల్పడేందుకు ప్రణాళికలు వేస్తుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) ఆరోపించారు. ఏపీలో కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ కాన్ఫరెన్స్లో బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ( Purandeshwari ), జనసేన నాయకుడు నాదేండ్ల మనోహర్(Nadendla Manohar ) పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అభ్యర్థులకు సూచనలు చేశారు. ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయం సాధించబోతుందని, మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేశారని ప్రశంసించారు.
పోస్టల్ బ్యాలెట్లలోనూ కొర్రీలు వేయాలని వైసీపీ చూస్తుందని అన్నారు. కూటమి ఏజెంట్లు, అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని, కౌంటింగ్ కేంద్రానికి సమయానికి చేరుకోవాలని సూచించారు. ఓటమి భయంతో ఎన్నికల సమయంలో అల్లర్లకు పాల్పడిన వైసీపీ, కౌంటింగ్ రోజున కూడా ఘర్షణకు దిగే అవకాశముందని, ప్రతి అభ్యర్థి లీగ్ టీంను అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు.