YS Avinash Reddy | టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మేనిఫెస్టోను ఎవరూ సీరియస్గా తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలపై ఎవరికీ నమ్మకం లేదని అన్నారు. కూటమి మేనిఫెస్టోలో బీజేపీ స్థానమేంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అసలు కూటమి మేనిఫెస్టోపై మోదీ ఫొటో కూడా ఎందుకు లేదో కారణం చెప్పాలని ప్రశ్నించారు.
కూటమి మేనిఫెస్టోపై ప్రధాని మోదీకి నమ్మకం లేదని ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు. 2014 ఎన్నికల సమయంలోనూ ఇదే తరహా హామీలతో చంద్రబాబు మోసం చేశారని గుర్తుచేశారు. అందుకే ఈసారి మేనిఫెస్టోపై తన ఫొటో పెట్టవద్దని మోదీ ఆదేశించారని వ్యాఖ్యానించారు. చంద్రబాబును జనం నమ్మే పరిస్థితి లేదని ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్కు వస్తున్న ఆదరణ చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. అందుకే జగన్ను చంపేస్తామని మాట్లాడుతున్నారని అన్నారు.