టీడీపీ నేతలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కొందరు తాము పుట్టుకతోనే చంద్రబాబుకు విధేయులమని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. అలా చెప్పుకోవడం సిగ్గు చేటు అని, ప్రజలను వంచించడమే అని అన్నారు. వాళ్లంతా ఒకప్పుడు ఎన్టీఆర్-లక్ష్మీ పార్వతికి సన్నిహితులు అనేది వాస్తవం, చారిత్రక పరిణామమని అన్నారు. ఇది దాచేస్తే దాగని, మార్చలేని సత్యమని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు.
నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు వీర విధేయుల్లో కొందరు 30 ఏళ్ల నాటి ఎన్టీఆర్–లక్ష్మీ పార్వతికి అత్యంత సన్నిహితులనేది వాస్తవం, చారిత్రక పరిణామం అని విజయసాయి రెడ్డి అన్నారు. ఇది దాచేస్తే దాగని, మార్చలేని సత్యమని తెలిపారు. వీరు 1994-96 కాలంలో ఫిరాయింపుదారులు అన్న విషయం ప్రజలకు, మీడియాకు గుర్తుండదు అని అనుకోవడం వారి అజ్ఞానమని విమర్శించారు.
తాము పుట్టుకతోనే చంద్రబాబుకు విధేయులమని వారు చెప్పుకోవడం సిగ్గుచేటు అని విజయసాయి రెడ్డి అన్నారు. అది ప్రజలని వంచించడమే అని పేర్కొన్నారు. అప్పుడు ఎన్టీఆర్-లక్ష్మీపార్వతికి సన్నిహితంగా ఉన్న వాళ్లలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, దాడి వీరభద్రరావు, మాకినేని పెదరత్తయ్య, కె.ప్రతిభా భారతి, కిమిడి కళావెంకటరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, చిక్కాల రామచంద్రరావు, పరిటాల రవి, గాదె లింగప్ప, ముక్కు కాశి రెడ్డి, గౌతు శివాజీ, గద్దె బాబు రావు ఉన్నారని తెలిపారు. ఎన్టీఆర్కు వెన్నుపోటుపొడిచి బహిష్కరణకు గురియైన వాళ్లలో చంద్రబాబు, యనమల రామకృష్ణుడు, అశోకగజపతి రాజు ఉన్నారని చెప్పారు. ఈ నేతల్లో 90 శాతానికి పైగా ఎన్టీఆర్ మరణించాక, 1996 లోక్సభ ఎన్నికల్లో ఎన్టీఆర్ టీడీపీ (ఎల్పీ) ఒక్క సీటూ దక్కించుకోకపోవడంతో గుట్టుచప్పుడు కాకుండా చంద్రబాబు పార్టీలో చేరారని గుర్తుచేశారు. 1997–2004 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టీడీపీ మంత్రివర్గం సభ్యులుగా, కొందరు ఎంపీలుగా, మరి కొందరు పార్టీ పదవులు పొందారని చెప్పారు. ఇది మాయని మచ్చ అని.. వీరిని చరిత్ర క్షమించదని అన్నారు.