AP News | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. సూపర్ సిక్స్ ఇస్తే ఏమీ.. ఇవ్వకపోతే ఏమీ.. నిత్యవసర వస్తువుల రేట్లు పెరిగితే మనకేంటి? పెరగకపోతే మనకేంటి? టమాట రూ.100 అయితే మనకేంటి? రూ.200 అయితే మనకేంటి? ఇసుక టన్నుపై 2000 అయితే మనకేంటి? 4000 అయితే మనకేంటి? మరో నాలుగేండ్ల తర్వాత ప్రజలకు దొంగ హామీలిచ్చి, మభ్యపెట్టి, మోసగించి, ఓట్లు వేయించుకోవచ్చు! మనకు కావాల్సింది రాష్ట్రాన్ని దోచుకోవడం.. కులం, మతం అంటూ అగ్గి రాజేసి అందులో చలికాపుకోవడమే.. ఇదే చంద్రబాబు నైజం అని విమర్శించారు.
చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు కూడా సరిగ్గా చెల్లించడం లేదని విజయసాయిరెడ్డి ఆరోపించారు. రూ.400 కోట్లు ఇస్తున్నట్లు ప్రభుత్వం జీవో విడుదల చేసిందని తెలిపారు. ఈ విషయాన్ని కుల మీడియా ఫ్రంట్ పేజిల్లో తాటికాయంత అక్షరాలతో రాసిందని, టీవీల్లో రోజంతా బ్రేకింగ్ న్యూస్లు నడిచాయని గుర్తుచేశారు. జీవో విడుదలైనప్పటికీ నిధులు మాత్రం హుళక్కి అని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు కుతంత్రాలు అలాగే ఉంటాయని విజయసాయి రెడ్డి విమర్శించారు. సమగ్ర శిక్షలో 25 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు రెండు నెలలుగా జీతాలు లేవని అన్నారు. ప్రాణాలు రక్షించే 108, 104 సిబ్బంది 6500 మందికి జూలై నుంచి నయా పైసా విదల్చలేదని విమర్శించారు. దసరా, దీపావళి వస్తున్నా అనేక డిపార్ట్మెంట్లలో వేల మంది చిరుద్యోగుల జీవితాల్లో చిమ్మ చీకట్లు తొలగిపోలేదని చెప్పారు. ఇదీ చంద్రబాబు మార్కు పాలన అని ఎద్దేవా చేశారు. దీన్ని మార్పు అనాలంట అని విమర్శించారు.