Varudu Kalyani | ఏరు దాటాక తెప్ప తగలేసినట్లుగా కూటమి బడ్జెట్ ఉందని ఎమ్మెల్సీ, వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కల్యాణి ఎద్దేవా చేశారు. ఏడు నెలల పాటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అమలు చేసి దేశ చరిత్రలోనే ఎవరూ చేయని చెత్త రికార్డును కూటమి ప్రభుత్వం నెలకొల్పిందని విమర్శించారు.
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సోమవారం వరుదు కలమ్మాట్లాడుతూ.. ఎన్నో పథకాలు ఇస్తామని ప్రగల్బాలు పలికిన కూటమి ప్రభుత్వం.. ఈ బడ్జెట్లో దేనికీ నిధులు కేటాయించలేదని విమర్శించారు. ప్రజలను ఈ ప్రభుత్వం నిట్టనిలువుగా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఏటా రూ.20 వేలు ఇస్తామన్నారని.. కానీ కేవలం రూ.5వేల కోట్ల నిధులే కేటాయించారని అన్నారు. తల్లికి వందనం పథకం కోసం కేవలం రూ.5300 కోట్లు కేటాయించారని.. ఇవి ఏ మూలకు సరిపోతాయని ప్రశ్నించారు. సగం సగం నిధులు కేటాయించి ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారని.. కానీ బడ్జెట్లో మాత్రం నిధులు కేటాయించలేదని వరుదు కల్యాణి తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలకు నెలకు 1500 ఇస్తామన్న మహాశక్తి పథకానికి కూడా నిధులు కేటాయించలేదని అన్నారు. 50 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు 3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారని.. ఆ నిధులు ఎక్కడ అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలను కూటమి ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను మభ్యపెట్టి మోసం చేశారని.. ప్రజలను నిట్టనిలువుగా ముంచారని అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వైసీపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.