AP News | తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్రంగా స్పందించింది. దేవుడితో ఏపీ సీఎం చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడారని అన్నారు. శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వాడటం కాదు.. జంతువుల కొవ్వు వాడుతున్నారని ఆరోపణలు చేశారని ముఖ్యమంత్రి చెప్పారని తెలిపారు. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపారన్న చంద్రబాబు ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాస్తానని తెలిపారు.
తిరుమలలో సరుకులకు మూడంచెల్లో చెకింగ్ ఉంటుందని సజ్జల తెలిపారు. జూన్ 12న నెయ్యి శాంపిల్స్ తీసుకుంటే 23న రిపోర్టు వచ్చిందని చెప్పారని అన్నారు. మరి ఆ నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపించారా? లేదా అని ప్రశ్నించారు. తిరుమలలో ల్యాబ్ లేదని చెప్పారని.. మరి రిపోర్టు తిరుమల ల్యాబ్ అడ్రస్‌తోనే ఎలా వచ్చిందని నిలదీశారు.
టీటీడీ చేయించిన టెస్టులో జంతువుల కొవ్వు ఆనవాళ్లు లేవని సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. ఆవులు తినే ఆహారం బట్టి పాలల్లో లక్షణాలు ఉంటాయని అన్నారు. ఆవులు ఎక్కడైనా మాంసం తింటాయా అని ప్రశ్నించారు. నెయ్యి తయారీ కంటే ముందే పాలను టెస్టు చేసి పంపుతారని.. టెస్ట్ చేయకుండానే అనుమతి ఇవ్వరని పేర్కొన్నారు. టెస్టుల్లో తేడా వస్తే వెనక్కి పంపుతారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఒక డైరీ యజమాని అని.. ఆయన అమ్మే హెరిటేజ్ నెయ్యిని పంపించినా ఇలాంటి రిపోర్టే వస్తుందని తెలిపారు. అంటే హెరిటేజ్ నెయ్యిలో కూడా ఇతర జంతువుల కొవ్వు ఉంటుందా అని నిలదీశారు. ల్యాబ్ రిపోర్టు నెగెటివ్ వచ్చింది కానీ.. చంద్రబాబు మాత్రం జంతువుల కొవ్వు ఉంటుందని తీవ్ర ఆరోపణలు చేశారని అన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తిరుమలకు ఉన్న నమ్మకాన్ని పెంచాలి తప్ప.. ఇలా పోగొట్టకూడదని హితవు పలికారు.