Sajjala Ramakrishna Reddy | అసాధ్యమైన హామీలతో ప్రత్యర్థులు అందలం ఎక్కారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెబుతూ.. హామీలను ఎగ్గొట్టాలని చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు. అలవికాని హామీలివ్వడం ఎందుకు? ఇప్పుడు అమలు చేయలేమని చేతులెత్తేయడం ఎందుకని ప్రశ్నించారు.
వైసీపీ కార్యాలయంలో వైఎస్సార్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. అసాధ్యమైన హామీలతో ప్రత్యర్థులు అందలం ఎక్కారని సజ్జల ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వారు హామీలను అమలు చేయలేమని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికప్పుడు హామీలు అమలు చేయడం సాధ్యం కాదన్నట్లుగా చంద్రబాబు మాట్లాడుతున్నారని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని చంద్రబాబు అంటున్నారని.. ఆర్నెల్ల క్రితం హామీలిచ్చేప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంచనా లేదా అని ప్రశ్నించారు. అలవికాని హామీలివ్వడం ఎందుకు? ఇప్పుడు అమలు చేయలేమని చేతులెత్తేయడం ఎందుకని మండిపడ్డారు.
చంద్రబాబు ఇచ్చిన హామీల్లో కనీసం 10 శాతం హామీలు ఇచ్చినా కూడా వైసీపీకి ఈ పరిస్థితి వచ్చేది కాదని పలువురు అంటున్నారని సజ్జల తెలిపారు. కానీ అది జగన్ పద్ధతి కాదని పేర్కొన్నారు. అలవికాని హామీలిచ్చి ప్రజల్ని మోసం చేయడం జగన్కు ఇష్టం లేదని స్పష్టం చేశారు. పదే పదే అలా మోసం చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతే చంద్రబాబును అందరూ కలిసి నిలదీద్దామని సజ్జల పిలుపునిచ్చారు. రాష్ట్రానికి ఏ ఇబ్బంది కలిగినా వైసీపీ చూస్తూ ఊరుకోబోదని తెలిపారు. ప్రజల పక్షాన పోరాటానికి తమ పార్టీ ఎప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేశారు. వైఎస్ ఆశయ సాధన కోసం జగన్ ఎంతో కృషి చేశారని సజ్జల తెలిపారు. ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశామని అన్నారు. కుల, మత, ప్రాంత, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా జగన్ పరిపాలన చేశారని అన్నారు. విద్య, వైద్య రంగాల్లో జగన్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. ఇళ్ల ముంగిటకే పరిపాలనను తెచ్చారని అన్నారు.