AP News | మా ముందే చెప్పులు వేసుకుని నడుస్తారా? మీరు మా వీధుల్లో తిరగకూడదు! అసలు ఈ ఊర్లోనే ఉండకూడదు.. ఖాళీ చేసి వెళ్లిపోండి.. ఇది చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో టీడీపీ నేతలు దళితులకు జారీ చేసిన హుకుం!! సిమెంట్ రోడ్డు నిర్మాణ విషయంలో గ్రామ సర్పంచ్‌తో ఏర్పడిన వివాదం నేపథ్యంలో టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి పురుషోత్తం నాయుడు, ఇతర నేతలు ఇలా రెచ్చిపోయారు. దీంతో టీడీపీ నేతలపై దళితులు కూడా తిరగబడ్డారు. ఈ ఘటనలో 8 మంది దళితులు, ఇద్దరు టీడీపీ నేతలు గాయపడ్డారు.
అయితే, ఈ ఘటనలో దళితులను రెచ్చగొట్టి వైసీపీ నాయకులే తమపై దాడికి దిగారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ కేసులో న్యాయం చేయాలని టీడీపీ కార్యకర్తలే మంత్రి నారా లోకేశ్‌ను ట్విట్టర్ ద్వారా టీడీపీ కార్యకర్తలు విజ్ఞప్తి చేశారు. దీనిపై నారా లోకేశ్ కూడా స్పందించారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పారు. ఈ దారుణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
దళితుల మీద దాడి ఘటనపై మాజీ మంత్రి రోజా సెల్వమణి తీవ్రంగా స్పందించారు. దళితులను ఊళ్లోకి రానివ్వమని, ఊరి నుంచి వెలివేయాలని హుకుం జారీ చేస్తున్న టీడీపీ నాయకులను చూడండి అంటూ ట్విట్టర్(ఎక్స్)లో వీడియో షేర్ చేశారు. దళితులపై భౌతికంగా దాడి చేసి, వాళ్ల ఆస్తులు ధ్వంసం చేసి, వాళ్ల మీదే రివర్స్ కేసు పెట్టడం ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు.
దాడికి పాల్పడ్డ పురుషోత్తం, కిరణ్, వంశీలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అప్పుడే నారా లోకేశ్ మాటకు గౌరవం పెరుగుతుందని తెలిపారు. అంతేగానీ అధికారం ఉందని ఇలా బాధితులపై దాడులు చేస్తే మానవ జాతి క్షమించదని హెచ్చరించారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు.