RK Roja | మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పేరుతో కూటమి ప్రభుత్వం మోసం చేస్తున్నదని ఆర్కే రోజా ఆరోపించారు. అది స్త్రీ శక్తి పథకం కాదని.. స్త్రీ దగ పథకం అని మండిపడ్డారు. రాష్ట్రంలో 16 రకాల బస్సులు ఉంటే.. ఇప్పుడు ఐదు రకాల బస్సుల్లో మాత్రమే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం లేదని విమర్శించారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకం అమలు చేస్తామని చెప్పి.. 14 నెలల తర్వాత ప్రారంభించారని రోజా విమర్శించారు. ఇప్పుడు ఆర్టీసీ బస్సుల్లో లోకల్‌గా మాత్రమే ఫ్రీగా తిరగొచ్చని.. రాష్ట్రం మొత్తం ఉచితం లేదని ఆమె అన్నారు. రాష్ట్రం మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీ అని చెప్పి ఇవాళ ఆంక్షలు పెట్టారని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం కోతల ప్రభుత్వమని మరోసారి నిరూపించుకుందని విమర్శించారు. ఆలయాలు అన్ని చూడవచ్చని చెప్పి.. ఇప్పుడు మోసం చేశారని ఆరోపించారు. తిరుమల, అన్నవరం, విజయవాడ, శ్రీశైలం పుణ్యక్షేత్రాలకు ఉచిత దర్శనం లేదని విమర్శించారు.
ఇన్ని మోసాలు జరుగుతుంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదని ఆర్కే రోజా నిలదీశారు. సూపర్ సిక్స్ కాదు.. సూపర్ ఫ్లాప్ అని ఎద్దేవా చేశారు. తిరుపతి నుంచి తిరుమల వెళ్లడానికి ఫ్రీ బస్సు లేదని అన్నారు. శ్రీశైలం, విజయవాడ దుర్గమ్మ గుడి, సింహాచలానికి ఉచిత బస్సు ప్రయాణం లేదని గుర్తుచేశారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఆడబిడ్డ నిధి ఇస్తామని చెప్పి ఒక్కరికి కూడా ఇవ్వలేదని అన్నారు. చంద్రబాబుకు ఆడబిడ్డలను గౌరవించడం తెలియదని అన్నారు. కానీ పవన్ కల్యాణ్‌కు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఆయన ప్రశ్నించాలని డిమాండ్ చేశారు.
జగనన్న ఆడబిడ్డలకు చెప్పింది చెప్పినట్లుగా అమలు చేశారని ఆర్కే రోజా గుర్తుచేశారు. చంద్రబాబు అధికారంలోకి రావడం కోసమే అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. మహిళల్ని మోసం చేసినవాళ్లు ఏ రాష్ట్రంలోనూ బాగుపడలేదని అన్నారు. వైఎస్ జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తామని చంద్రబాబు మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.