Pothina Mahesh | తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదంపై వైసీపీ నేత పోతిన మహేశ్ తీవ్రంగా స్పందించారు. 100 రోజుల పాలనలో చేసింది చెప్పుకోలేకనే తిరుమల లడ్డూ ప్రసాదంపై ఏపీ సీఎం చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. జూలైలో రిపోర్టు వస్తే సెప్టెంబర్లో బయటపెట్టడం ఏంటని ప్రశ్నించారు. శాంపిల్స్ ఎప్పటివి? రిపోర్టు ఎప్పుడు ఇచ్చారు? ఎక్కడ సేకరించారనే అనేక సందేహాలు భక్తుల్లో ఉన్నాయని అన్నారు.
నాణ్యత లేకపోతే నెయ్యి ట్యాంకర్లను తిప్పి పంపించామని టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారని పోతిన మహేశ్ గుర్తు చేశారు. లడ్డూ ప్రసాదంలో నాణ్యతా ప్రమాణాలు తగ్గకూడదని గత ప్రభుత్వం చర్యలు తీసుకుందని పోతిన మహేశ్ అన్నారు. దేశీ అవులతో గోశాల ఏర్పాటు చేసింది కూడా గత ప్రభుత్వమేనని గుర్తు చేశారు. ఇది కూటమి ప్రభుత్వానికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.
శ్రీవారి లడ్డూ సరుకులను శ్రీవైష్ణవులు ముందుగానే తనిఖీ చేస్తారని.. సరిగ్గా లేకపోతే తిరిగి పంపిస్తారని పోతిన మహేశ్ చెప్పారు. అలాంటిది తేడా జరిగితే శ్రీవైష్ణవులు ఎందుకు ఊరుకుంటారని ప్రశ్నించారు. లడ్డూ తయారీకి వాడే వస్తువులను ముందే తనిఖీ చేస్తారని.. లడ్డూ తయారు చేసిన తర్వాత తనిఖీ చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. కల్తీ అయ్యిందని చెబుతున్న నెయ్యి ఎప్పుడు వచ్చింది? ఏ ట్యాంక్లో వచ్చిందనే విషయాలు చెప్పకుండా కోట్లాది హిందూ భక్తుల మనోభావాలతో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు, కూటమి ప్రభుత్వానికి వెంకన్న భక్తులు సరైన జవాబు ఇస్తారని అన్నారు.