Pinnellli Ramakrishna Reddy | నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు విధించే ఏ షరతులకు కట్టుబడి ఉంటానని తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. రాజకీయ పెద్దల ప్రోద్బలంతో తనను పోలీసులు లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఏపీ హైకోర్టులో పిన్నెల్లి పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లు రేపు (సోమవారం) విచారణకు రానున్నాయి.
పోలింగ్ రోజు రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేయడం, అడ్డుకోబోయిన టీడీపీ పోలింగ్ ఏజెంట్‌పై దాడి చేయడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పల్నాడు జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్ మరుసటి రోజు కారంపూడిలో అరాచకం సృష్టించడం, అడ్డుకోబోయిన సీఐపై దాడి చేసి కేసుల్లో పిన్నెల్లితో పాటు ఆయన తమ్ముడు, అనుచరులపై కేసులు పెట్టారు. ఈ నాలుగింటిలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు.
ఈ కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జూన్ 26న అరెస్టు చేశారు. కోర్టు రిమాండ్ విధించడంతో అప్పటి నుంచి నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ కేసుల్లో దిగువ కోర్టులో రెండు సార్లు బెయిల్ కోసం ప్రయత్నించగా న్యాయస్థానం వాటిని కొట్టివేసింది. ఈ క్రమంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.