Perni Nani | పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో నిబంధనలను సడలిస్తూ సీఈవో ప్రత్యేక గైడ్లైన్స్ ఇవ్వడం పట్ల వైసీపీ నేత పేర్ని నాని అభ్యంతరం వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాలకు పోస్టల్ బ్యాలెట్ కవర్లు, 13ఏ, 13బీ నిబంధనలను పంపించారని తెలిపారు. గెజిటెడ్ అధికారి సంతకం పెట్టి స్టాంప్ వేయాలని.. స్టాంప్ లేకపోయినా, చేత్తో రాయకపోయినా సరే ఆమోదించబోమని చెప్పారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కొత్తగా అలా స్టాంప్ వేయకపోయినా.. చేత్తో రాయకపోయినా సరే ఆమోదించాలని అన్నారని తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్రంలో నిబంధన ఏపీలోనే ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు.
కేంద్ర ఎన్నికల సంఘంలో లేని సడలింపులు ఇక్కడే ఎందుకు ఇచ్చారని పేర్ని నాని ప్రశ్నించారు. ఈసీ నిబంధనల వల్ల ఓటు రహస్యత ఉండదని అభిప్రాయపడ్డారు. ఒక పార్టీ కోరగానే ఇలాంటి గైడ్లైన్స్ ఎలా ఇస్తారని నిలదీశారు. ఎక్కడా లేని సర్క్యులర్ ఇవ్వడం ఎంత వరకు సమంజసమని అడిగారు. ఈ నిబంధనలపై పునరాలోచించాలని కోరారు.