Perni Nani | తాడేపల్లి క్యాంప్ ఆఫీసును జగన్ ప్యాలెస్ అంటూ టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారంపై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. జనం దగ్గర దోచుకున్న సొమ్ముతో జగన్ ప్యాలెస్‌లు కడుతున్నారంటూ ఏపీ మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలపైనా ఆయన విరుచుకుపడ్డారు. ఖలేజా ఉన్న నాయకుడివి అయితే హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఇంటి ఫొటోలు చూపించాలని సవాలు విసిరారు.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న చంద్రబాబు ఇంటికి మీడియా టూర్ పెట్టాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూడా మీడియా టూర్ పెడదామని అన్నారు. లేదంటే రిటైర్డ్ జడ్జితో ఒక కమిటీ వేసి ఇద్దరి ఇళ్ల విలువలను కట్టిద్దామని తెలిపారు. 2019 నుంచి 2024వరకు మీరు కాపురం ఉన్న మీ ఇంటి ఖరీదు ఎంత, మీ ఇంటి బయట గోడల ఎత్తు ఎంత? ఆ గోడలు ఎంత విశాలంగా ఉన్నాయి? ఇల్లు ఎన్ని వేల చదరపు అడుగుల్లో ఉంది? ఆ ఇంట్లో వాడిన రాయి ఏంటి? జగన్ ఇంట్లో వాడిన రాయి ఏంటి? దాని విలువ ఎంత? దీని విలువ ఎంత? జగన్మోహన్ రెడ్డి ఇంట్లో బాత్రూంలో గానీ, ఇంట్లో వాడుకునే సామాను విలువ ఎంత? మీ ఇంట్లోని సామాను విలువ ఎంత? జగన్మోహన్ రెడ్డి ఇంట్లో సోఫాల విలువ ఎంత? మీ ఇంట్లో వాడే సోఫాల విలువ ఎంత? అనేది మొత్తం ఆడిట్ చేయిద్దామని అన్నారు. మీరు రాసిన రెడ్ బుక్ నిజమైతే చంద్రబాబు, జగన్ ఇళ్లను ఆడిట్ చేయించండని సవాలు విసిరారు.
అసలు మీ ఇంటి ఫొటోలు ఎందుకు బయటకు ఇవ్వరని చంద్రబాబు, నారా లోకేశ్‌పై పేర్ని నాని మండిపడ్డారు. జనసేన అధినే పవన్ కల్యాణ్ ఇంటికి వస్తే కూడా సోఫాలో ఉన్న ఫొటోలనే బయటకు ఇస్తారే తప్ప.. ఇల్లంతా ఎందుకు ఫొటోలు తీయనివ్వరని ప్రశ్నించారు. మీరేమో రాజమహల్లో ఉంటారు.. జగన్‌వి ప్యాలెస్‌లు అంటూ విమర్శలు చేస్తారా అని మండిపడ్డారు.
సీనియర్ ఎన్టీఆర్‌ను కుల్లబొడిచారని పేర్ని నాని ఆరోపించారు. ఆయనకు ఎన్ని అవమానాలు చేయాలో అన్ని చేశారని అన్నారు. ఎన్టీఆర్ మీద చెప్పులు వేశారని.. ఆయన నుంచి అధికారం లాక్కున్నారని విమర్శించారు. అన్నెంపున్నెం తెలియని చిన్న పిల్లాడి మనస్తత్వం ఉన్న ఎన్టీఆర్‌కు ఎన్నో అంటగట్టారని మండిపడ్డారు. వయాగ్రా వాడుతున్నాడని ప్రచారం చేశారన్నారు. 70 ఏళ్ల వయసులో ఎన్టీఆర్ వయాగ్రా వాడతారా? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌పై ఎన్ని వార్తలు రాయించారు? ఎన్ని దూషణలు చేశారని మండిపడ్డారు.
అన్నం పెట్టే దిక్కులేక పెళ్లి చేసుకుంటే.. ఎన్టీఆర్‌కు సెక్స్కోరికలు, వయాగ్రాలు అంటగట్టారని పేర్ని నాని దుయ్యబట్టారు. పిల్లాడ్ని పుట్టించాలని అడుగుతున్నాడంటూ ఎన్టీఆర్ వ్యక్తిత్వ హననం చేశారని మండిపడ్డారు. నాడు ఎన్టీఆర్ నుంచి ఇవాళ జగన్ వరకు చంద్రబాబుకు వ్యతిరేకంగా, చంద్రబాబు రాజ్య కాంక్ష తీర్చడం కోసం, చంద్రబాబును అధికారంలో కూర్చోబెట్టడం కోసం ఎంతటి వ్యక్తినైనా వ్యక్తిత్వ హననం చేయనిదే వీళ్లు వదిలిపెట్టే ప్రసక్తి లేదని మండిపడ్డారు.