Perni Nani | ఏపీలో టీడీపీ, జనసేన పార్టీ నాయకులు అధికార మదంతో రెచ్చిపోతున్నారని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఎన్నికల్లో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేల ప్రోత్సాహంతో రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నారని తెలిపారు. మా కార్యకర్తలు చేసే ధ్వంసాన్ని చూస్తూ ఉండండి తప్ప కేసులు పెట్టవద్దని ఎస్పీలకు, డీజీపీల చేతులు కట్టి చంద్రబాబు మారణ హోమం సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
కౌంటింగ్ రోజు నుంచే వైసీపీ నాయకులపై టీడీపీ, జనసేన నాయకులు దాడులకు పాల్పడుతున్నారని పేర్ని నాని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలే ఈ దాడుల్ని ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. డీజీపీ, పోలీసులు ఉద్యోగం చేయకుండా చంద్రబాబు వాళ్ల చేతులు కట్టేశారని అన్నారు. బిహార్, యూపీ మాదిరి ఏపీలో హింసారాజ్యం రచిస్తున్నారని తెలిపారు. మా ఇండ్లపై దాడులు చేస్తుంటే పోలీసులు కనీసం కేసులు కూడా పెట్టడం లేదని మండిపడ్డారు. టీడీపీ రౌడీ షీటర్లు మహిళల పట్ల అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇంత దాడులు చేస్తున్నా పోలీసులు చూస్తూ ఉంటే.. మేం కూడా తిరగబడక తప్పదని హెచ్చరించారు. చంద్రబాబు చేయిస్తున్న దౌర్జన్యాలపై చర్యలు తీసుకోకపోతే కోర్టుకు వెళ్తామని అన్నారు.