Peddireddy Ramachandra Reddy | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు కుట్రలు పన్ని లక్షల, కోట్ల విలువ చేసే మెడికల్ కాలేజీ భూముల్ని వంద రూపాయలకే విక్రయిస్తున్నాడని ఆరోపించారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
అనంతరం పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. 50 ఎకరాల మెడికల్ కాలేజీ భూముల వల్ల రాష్ట్రానికి లక్షల కోట్ల ఆదాయం వస్తుందని తెలిపారు. పేద విద్యార్థులు డాక్టర్లు అవ్వడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కానీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల దాదాపు రూ.2150 మెడికల్ సీట్లు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పులివెందులలో 50 సీట్ల మెడికల్ కాలేజీ పూర్తయినా చంద్రబాబు నాయుడు అడ్డుకుని నేషనల్ కౌన్సిల్‌కు లేఖ రాశారని మండిపడ్డారు.
నాడు – నేడు కింద హాస్పిటల్స్, స్కూళ్లకు వైఎస్ జగన్ వేల కోట్లు ఖర్చు చేశారని.. కానీ అవన్నీ ఇప్పుడు మూలన పడ్డాయని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. 17 మెడికల్ కాలేజీలు వస్తే ప్రతి సంవత్సరం 4500 సీట్లు అదనంగా వస్తాయని పేర్కొన్నారు. ఐదేండ్లలో 30 నుంచి 40 వేల మంది ప్రతి సంవత్సరం వైద్య, విద్య అభ్యసిస్తారని.. ఇలాంటి దాన్ని కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు అతని కుటుంబసభ్యులు, మంత్రులు డబ్బు ఆశతోనే ఇలాంటి కుట్ర చేస్తున్నారని విమర్శించారు.