పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కడప జిల్లా అధ్యక్షుడు పల్లె రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. ప్రజలు, వైసీపీ కార్యకర్తలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ.. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలందరూ వైఎస్ జగన్ వెంటే ఉన్నారని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.
సూపర్ సిక్స్ హామీలని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని పల్లె రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల ముందు హామీలిచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వంతో విసిగిన ప్రజలు.. 2029లో మళ్లీ వైఎస్ జగన్ గెలవాలని కోరుకుంటున్నారని తెలిపారు. అసలు పులివెందుల జడ్పీటీసీ ఎన్నికకు నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారో అర్థం కావడం లేదని అన్నారు. ఓటింగ్ శాతం తక్కువగా ఉండేందుకు కూటమి ప్రభుత్వం దారుణాలకు ఒడిగడుతుందని అన్నారు.
ప్రజలు ఓట్లు వేయడానికి లేకుండా, దొంగ కేసులతో భయబ్రాంతులకు గురిచేస్తున్నారని పల్లె రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇలాంటి ఎన్నికుల జరగలేదని అన్నారు. వైఎస్ జగన్ తలచుకుంటే గతంతో చంద్రబాబు, నారా లోకేశ్, పవన్ కల్యాణ్ రాష్ట్రంలో తిరిగేవాళ్లు కాదని.. నామినేషన్ కూడా వేసేవాళ్లు కాదని తెలిపారు. కానీ కూటమి ప్రభుత్వం నేడు అరాచక పాలన చేస్తోందని విమర్శించారు. కూటమి అరాచక పాలనపై కోర్టును ఆశ్రయిస్తామని.. ఎన్నికల కమిషన్కు కూడా ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ పద్ధతి మార్చుకుంటే మంచిదని.. లేదంటే చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.