AP News | గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఉదంతంలో ఏపీ ప్రభుత్వ తీరుపై మాజీ ఎంపీ మార్గాని భరత్ విమర్శలు గుప్పించారు. ఏపీలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయని విమర్శించారు. గుడ్లవల్లేరు ఘటనను డైవర్ట్ చేసేందుకే ముంబై నటి కేసును తెరపైకి తీసుకొచ్చారని అన్నారు. గుడ్లవల్లేరు కాలేజీలో 300 మంది ఆడపిల్లల విషయంలో కూటమి ప్రభుత్వానికి శ్రద్ధ లేదని.. కానీ ముంబై నటి విషయంలో మాత్రం అత్యంత శ్రద్ధ పెట్టారని విమర్శించారు.
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లో స్పై కెమెరాలు పెట్టి అమ్మాయిల వీడియోలు తీస్తున్నారని మార్గాని భరత్ అన్నారు. దీనిపై అమ్మాయిలు బయటకొచ్చి గొంతెత్తి మాట్లాడుతున్నారని తెలిపారు. ఆ కాలేజీలో గత రెండేళ్లుగా ఇది జరుగుతూనే ఉందని చెప్పారు. అయినప్పటికీ దీనిపై కాలేజీ యాజమాన్యం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.ఈ ఘటనను కప్పిపుచ్చే కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. నాలుగైదు రోజులుగా ఈ ఉదంతాన్ని క్లియర్అప్ చేసే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. దీన్ని డైవర్ట్ చేసేందుకే ముంబై నుంచి పేటీఎం నటిని తీసుకొచ్చారని చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. 300 మంది అమ్మాయిల సమస్యను పక్కనబెట్టి.. కాదంబరి గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందని ప్రశ్నించారు.
కాగా, కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ వద్ద మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శనివారం ఉదయం పలువురు విద్యార్థులు కాలేజీలోకి వెళ్లేందుకు యత్నించారు. కానీ వారిని పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదని విద్యార్థులను కళాశాలలోకి వెళ్లేందుకు నిరాకరించారు. దీంతో పోలీసులు, విద్యార్థి సంఘాల మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ క్రమంలో పలువురు విద్యార్థులను పోలీసులను అదుపులోకి తీసుకున్నారు.