Kakani Govardhan Reddy | నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని లేపేస్తే డబ్బే డబ్బు అంటూ ఓ వీడియో వైరల్ కావడంపై మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్దన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఎమ్మెల్యే మీద హత్యాయత్నం అంటూ డ్రామాలు ఆడుతున్నారని.. ఈ కేసులో ఎవర్ని ఇరికిస్తారో చూడాలని అన్నారు. నెల్లూరులో రౌడీషీటర్స్, ముఠాలను పెంచి పోషించింది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కాదా అని ఆయన ప్రశ్నించారు. శ్రీకాంత్ పెరోలు విషయంలో అడ్డంగా బుక్కవ్వడంతో.. దాని నుంచి బయటపడటం కోసమే ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. శ్రీకాంత్‌కు పెరోలు మంజూరు చేసింది కూటమి ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. ఎవరు చెబితే హోంమంత్రి అనిత సంతకం పెట్టిందని నిలదీశారు. ఏం తీసుకుని? ఎవరి ప్రలోభంతో ఆమె పెరోల్‌పై సంతకం చేశారని ప్రశ్నించారు.
కోటంరెడ్డి వ్యవహారంలో వైసీపీ పాత్ర ఉందని సిగ్గుమాలిన విమర్శలు చేస్తున్నారని కాకాణి గోవర్దన్ రెడ్డి మండిపడ్డారు. ఆ వీడియోలో ఉన్న వ్యక్తులు అందరూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నేత రూప్ మనుషులే అని చెప్పారు. తప్పులు చేసేది టీడీపీ నేతలు అని.. కేసులు మాత్రం వైసీపీ నేతలపై పెడుతున్నారని మండిపడ్డారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే శ్రీకాంత్ పెరోలు, కోటంరెడ్డి మర్డర్ ప్లాన్ విషయాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే సహించే పరిస్థితులు ఉండవు జాగ్రత్త అని హెచ్చరించారు.
రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని కాకాణి ఆరోపించారు. రైతులకు యూరియా ఇవ్వలేని విజనరీ చంద్రబాబుది అని విమర్శించారు. ఇది రైతు ప్రయోజనాల కోసం పనిచేసే ప్రభుత్వం కాదని.. దళారీలు, వ్యాపారస్తులు ప్రయోజనాల కోసం పనిచేస్తుందని అన్నారు. చంద్రబాబు ఏనాడు అధికారంలోకి వచ్చినా రైతులకు చీకటి రోజులే అని అనుకుంటున్నారని విమర్శించారు. రైతాంగానికి మద్దతుగా వైసీపీ పోరాటం కొనసాగిస్తుందని.. వారికి అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.