AP News | వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు మరో షాక్ తగిలింది. ఏంఎడీ ఇంతియాజ్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతోనే తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లుగా తెలిపారు.
పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఐఏఎస్‌గా స్వచ్ఛంద విరమణ(వీఆర్ఎస్) తీసుకుని రాజకీయాల్లోకి వచ్చానని ఇంతియాజ్ తెలిపారు. కర్నూలు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయానని పేర్కొన్నారు. దీంతో తన బంధువులు, శ్రేయోభిలాషులతో చర్చించి రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే రాజకీయాలకు మాత్రమే దూరంగా ఉంటానని.. ప్రజా సేవకు కాదని స్పష్టం చేశారు.
ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారిగా, సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిగా మెరుగైన సమాజం కోసం తన వంతు కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఇంతియాజ్ తెలిపారు. సమాజిక అసమానతలు రూపుమాపేందుకు, పర్యావరణ కాలుష్యం తగ్గించే దిశగా పనిచేసే స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.