Gudivada Amarnath | ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని ఏ శాఖ మీద అవగాహన లేకుండానే నారా లోకేశ్ సకల శాఖల మంత్రిగా తయారయ్యారని ఎద్దేవా చేశారు. వైజాగ్‌లో గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. మాజీ సీఎం వైఎస్ జగన్ మీద మాట్లాడి లోకేశ్ అభాసుపాలయ్యారని విమర్శించారు.
ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులన్నీ వైసీపీ ప్రభుత్వ హయాంలో వచ్చినవేనని గుడివాడ అమర్నాథ్ తెలిపారు. కానీ జగన్ పాలనలో వచ్చిన ప్రాజెక్టులను తమ పాలనలో వచ్చినట్లు టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఉత్తరాంధ్రకు చంద్రబాబు ఏం చేశారో చెబితే బాగుంటుందని అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు.
శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, మూలపేట పోర్టు నిర్మాణం నారా లోకేశ్‌కు కనిపించడం లేదా అని గుడివాడ అమర్నాథ్ నిలదీశారు. మెడికల్ కాలేజీలు, భోగాపురం ఎయిర్‌పోర్టు ఎవరి హయాంలో నిర్మాణ పనులు జరిగాయని ప్రశ్నించారు. ఇన్ఫోసిస్ ఐటీ పరిశ్రమ ఎవరి హయాంలో వచ్చిందని ప్రశ్నించారు. మేం తీసుకొచ్చిన టీసీఎస్‌ను కూడా మీరే తీసుకొచ్చినట్లు చెప్పుకుంటున్నారని టీడీపీ నేతలపై మండిపడ్డారు. వైజాగ్‌లో ఐటీ రావడానికి వైఎస్ కుటుంబమే కారణమని స్పష్టం చేశారు.
వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని ప్రధాని మోదీతో నారా లోకేశ్ చెప్పించగలరా అని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. పుట్టని బిడ్డకు పేరు ఎలా పెడతరాని నారా లోకేశ్ అంటున్నారని గుర్తుచేశారు. మరి వైసీపీ హయాంలో వచ్చిన ప్రాజెక్టులు తమవని ఎలా చెప్పుకుంటారని మండిపడ్డారు.