ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. కమల్ హాసన్‌ను మించిపోయాడని మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. లోక నాయకుడు కమల్ హాసన్ అయితే.. లోక మాయకుడు చంద్రబాబు, దశావతారాలు చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. విశాఖపట్నంలో శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాబు ఏక్ నంబర్, బేటా దస్ నంబర్ అంటూ మంత్రి లోకేశ్‌పైనా సంచలన కామెంట్లు చేశారు. మామను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు సీఎం అయ్యారంటూ దుయ్యబట్టారు.
చంద్రబాబు సింగపూర్ పర్యటనపై గుడివాడ అమర్నాథ్ విమర్శలు గుప్పించారు. 1995 నుంచి చంద్రబాబుకు సింగపూర్‌తో సంబంధాలు ఉన్నాయని నారా లోకేశ్ అంటున్నారని తెలిపారు. మేం కూడా ఎప్పట్నుంచో అదే చెబుతున్నామని.. సింగపూర్‌లో బాబుకు ఉన్న సంబంధాలేంటో అందరికీ తెలుసని అన్నారు. చంద్రబాబు 30 ఏళ్లలో 58 సార్లు సింగపూర్‌కు వెళ్లారని.. అక్రమంగా దోచుకున్నది దాచుకోవడానికే చంద్రబాబు సింగపూర్ వెళ్లారని ఆరోపించారు. అక్కడికి వెళ్లి సాధించిందేంటని నిలదీశారు. సింగపూర్‌లో ఈశ్వరన్ మీకు బిజినెస్ పార్టనర్ కాదా అని నిలదీశారు. అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో ఏం సాధించారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై బహిరంగంగా చర్చించండని అన్నారు.
రెండు రోజులుగా వైఎస్ జగన్, వైసీపీపై పడి చంద్రబాబు, లోకేశ్ ఏడుస్తున్నారని గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. సింగపూర్ పర్యటనకు వెళ్లి సాధించిందేమీ లేక.. ఇక్కడ ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక జగన్‌పై పడిపోతున్నారని అన్నారు. నారా లోకేశ్ బరువు తగ్గాడు తప్ప.. బుద్ధి మాత్రం పెరగలేదని ఎద్దేవా చేశారు. బాబును మించిన అబద్ధాల కోరులా లోకేశ్ తయారయ్యారని విమర్శించారు. సింగపూర్‌లో ఎవరో ఈ మెయిల్ ద్వారా కంప్లయింట్ పెట్టారంట.. తీరా ఆ ఫిర్యాదు ఎవరు చేశారని చూస్తే టీడీపీ సానుభూతిపరుడే కావడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఇవన్నీ కూడా వైసీపీ ఖాతాలో వేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.